తైవాన్ పైకి చైనా కవ్వింపు చర్యలు

తైవాన్ పైకి చైనా కవ్వింపు చర్యలు
  •     మూడ్రోజుల్లో 158 యుద్ధ విమానాల చక్కర్లు
  •     కవ్వింపు చర్యలు మానుకోవాలని తైవాన్ హెచ్చరిక  
  •     తైవాన్ తమ దేశంలో భాగమేనంటూ డ్రాగన్ స్పందన  

తైవాన్ పైకి చైనా ఫైటర్ జెట్​లను పంపుతూ కవ్వింపు చర్యలకు దిగుతోంది.  24 గంటల్లో 103 యుద్ధవిమానాలను తైవాన్ గగనతలంపైకి చైనా పంపింది. మంగళవారం మరో 55 చైనీస్ ఫైటర్ జెట్​లు, ఏడు యుద్ధనౌకలు తైవాన్ జలసంధిలోని అనధికారిక ‘మీడియన్ లైన్’ బార్డర్​ను దాటాయి. దీంతో రెండు దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.

తైపీ :  తైవాన్ చుట్టూ ఇటీవల యుద్ధనౌకలను మోహరించి టెన్షన్ వాతావరణం సృష్టించిన చైనా గత మూడ్రోజులుగా వరుసగా ఫైటర్ జెట్ లను చక్కర్లు కొట్టిస్తూ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకూ 24 గంటల్లోనే103 యుద్ధవిమానాలను తైవాన్ గగనతలంపైకి చైనా పంపింది. మంగళవారం మరో 55 చైనీస్ ఫైటర్ జెట్ లు, ఏడు యుద్ధనౌకలు తైవాన్ జలసంధిలోని అనధికారిక ‘మీడియన్ లైన్’ బార్డర్ ను దాటాయి. మూడ్రోజుల్లోనే 158 ఫైటర్ జెట్ లను తమ గగనతలంపై చక్కర్లు కొట్టించడంతో తైవాన్ రక్షణ శాఖ తీవ్రంగా స్పందించింది. ప్రాంతీయ భద్రతకు భంగం కలిగించేలా రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని చైనాను హెచ్చరించింది. అయితే, తైవాన్ గగనతలంలో తమ ఫైటర్ జెట్ లు ఎగరడంపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ స్పందిస్తూ.. తైవాన్ తమ దేశంలో భాగమేనని, అందువల్ల తైవాన్ జలసంధిలో బార్డర్ లైన్ అనేది ఏదీ లేదన్నారు. కాగా, గతవారం తైవాన్ జలసంధి గుండా అమెరికా, కెనడాకు చెందిన రెండు షిప్ లు వెళ్లిన కారణంగానే తమ బలగాలు ‘హై అలర్ట్’ అయ్యాయని చైనా ఒక ప్రకటనలో పేర్కొంది.