
బీజింగ్: ఏ దేశంతోనూ తాము ముందుగా ట్రేడ్ వార్‌కు దిగబోమని.. కానీ ఎవరైనా దానిని ప్రారంభిస్తే మాత్రం భయపడబోమని చైనా తేల్చిచెప్పింది. చైనా వస్తువులపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 100 శాతం అదనపు టారిఫ్‌లను అమలు చేస్తే గనక.. అందుకు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. టారిఫ్‌ల విషయంలో అమెరికా ద్వంద్వ ప్రమాణాలను వదిలిపెట్టాలని, తప్పుడు విధానాలను సరిచేసుకోవాలని హితవు పలికింది.
రేర్ ఎర్త్ మినరల్స్, వాటి మైనింగ్, ఉత్పత్తుల ఎగుమతులపై చైనా గురువారం ఆంక్షలు విధించడంతో ఆ దేశంపై నవంబర్ 1 నుంచి అదనంగా 100 శాతం టారిఫ్‌లు విధిస్తామంటూ ట్రంప్ శనివారం ప్రకటించారు. దీంతో అమెరికా తీరుపై చైనా విదేశాంగ శాఖ ఆదివారం తీవ్రంగా స్పందించింది. తాము దేశ ప్రయోజనాలు, హక్కుల పరిరక్షణ కోసమే ఆంక్షలు విధించామని, రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతిని పూర్తిగా నిషేధించలేదని తెలిపింది.
మానవతావాద కార్యకలాపాలకు, డిజాస్టర్ రిలీఫ్, మెడికల్ రంగాల్లో వినియోగానికి లైసెన్సులను అనుమతిస్తున్నామని, కేవలం మిలిటరీపరమైన వినియోగానికే రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులపై ఆంక్షలు విధించామని పేర్కొంది. అమెరికా 100 శాతం టారిఫ్ లను అమలు చేస్తే గనక.. తాము తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
వాణిజ్యం విషయంలో చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని.. కానీ అమెరికా చైనాపై ఆర్థికపరమైన ఒత్తిడిని పెంచడం వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతింటున్నాయని పేర్కొంది. చర్చల ద్వారానే పరస్పర గౌరవంతో సమస్యను పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది.
కాగా, ఈ నెల చివర్లో సౌత్ కొరియాలో జరిగే అపెక్ సమిట్ సందర్భంగా చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ భేటీ కావాల్సి ఉంది. అయితే, జిన్ పింగ్‌తో భేటీ అయ్యేందుకు ఇప్పుడు అవసరమేమీ లేదంటూ ట్రంప్ శుక్రవారం కామెంట్ చేశారు. తాజాగా అదనపు టారిఫ్‌లనూ ప్రకటించడంతో ఇరు దేశాల మధ్య ట్రేడ్ వార్ మరింత ముదిరినట్లయింది.