- స్టేషనరీ, మెడికల్ గ్లౌజుల పేరుతో అక్రమ రవాణా
హైదరాబాద్, వెలుగు: దసరా, దీపావళి నేపథ్యంలో విదేశీ బాణసంచా స్మగ్లింగ్‌పై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) నిఘా పెంచింది. చైనా నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.12 కోట్ల విలువైన క్రాకర్స్‌ను చెన్నై పోర్టులో మంగళవారం సీజ్ చేసింది. కంటైనర్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన డీఆర్‌ఐ అధికారులు.. స్టేషనరీ సామగ్రి, మెడికల్ గ్లౌజులు, ప్లాస్టిక్ క్లిప్‌లు, హెయిర్ బ్యాండ్లు, స్టోరేజ్ వార్డ్‌రోబ్, షూ ర్యాక్ తదితర వస్తువుల మాటున బాణసంచాను దాచినట్లు గుర్తించారు.
కార్టన్ల వెనుక ఉంచిన చైనాకు చెందిన పైరోటెక్నిక్ బాణసంచాను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, బెంగళూరు సహా దక్షిణ భారతంలోని మెట్రో నగరాలకు సరఫరా చేసేందుకు వీటిని అక్రమంగా తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని హైదరాబాద్ జోనల్ డీఆర్‌ఐ అధికారులు తెలిపారు.
విదేశాల నుంచి బాణసంచా, పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన ముడిసరుకు స్మగ్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో చెన్నై పోర్టులో నిఘా పెట్టినట్లు వెల్లడించారు. భారత విదేశీ వాణిజ్య నిబంధనల ప్రకారం బాణసంచా దిగుమతిపై ఆంక్షలు ఉన్నాయి. డీజీఎఫ్‌టీ, పెసో అనుమతులు అవసరం. అవేవీ లేకుండా దిగుమతి చేసినట్లు గుర్తించి కస్టమ్స్ యాక్ట్–1962 కింద క్రాకర్స్‌ను సీజ్ చేశారు.
