
‘జీవితంలో ఏదో జరగకూడదని జరిగింది కదా అని జీవితాన్ని దుర్భరం చేసుకోవద్దు.. ఆశాజనకంగా ఉండండి, ఎదురొడ్డి పోరాడండి, కచ్చితంగా మీ జీవితం అందరూ ఆమోదించేలా ఉంటుంది’ అన్నారు చిరంజీవి. ఆదివారం సాయంత్రం జరిగిన ‘బేబి’ చిత్రం సక్సెస్ మీట్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘నన్ను స్ఫూర్తిగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన అభిమానులు.. సక్సెస్ అవడం చూసి ఎంతో ఆనందపడుతున్నా. అందుకు ఉదాహరణ ఈ వేడుక. ‘కలర్ ఫొటో’ చిత్రంతో గొప్ప కథకుడిగా, ‘బేబీ’తో అద్భుతమైన సమకాలీన చిత్రాలు తీసే సత్తా ఉన్న దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు సాయి రాజేష్.
అతను నా అభిమాని అని చెప్పుకోవడం గర్వంగా ఉంది. హీరోగా ఆనంద్ దేవరకొండ.. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. వైష్ణవి కూడా చాలా మెచ్యూర్డ్‌గా నటించింది. ప్రేమికుడిగా విరాజ్ నటన చూసి ఆ పాత్రపై గౌరవం కలిగింది. నేటి యువత సోషల్ మీడియా ఆకర్షణలో పడి, వీడియో చాట్ రికార్డుల వల్ల సూసైడ్ వరకూ వెళుతున్నారు. తల్లిదండ్రులు కూడా జాగ్రత్త పడాలి. అలాంటి సందేశాన్ని ఇచ్చిన చిత్రం కనుక దీన్నొక ఎడ్యుకేషనల్ సినిమాలా చూడాలి. ఇటీవల ఈ సినిమా చూసి, క్లైమాక్స్ మరోలా ఉంటే ఇంకా బాగుండేదని సలహా ఇచ్చా.
కానీ తర్వాత అది తప్పు అనిపించింది. ఎందుకంటే ఒక అమ్మాయికి తను కోరుకున్న జీవితం దక్కపోయినప్పటికీ, ఆమె జీవితం ఆశావాదంతో ముందుకెళ్లాలనే క్లైమాక్సే ఈ సినిమాకు కరెక్ట్’ అన్నారు. మెగాస్టార్ తమ సినిమా ఈవెంట్‌కు రావడం గర్వంగా ఉందని హీరోహీరోయిన్స్‌తో పాటు సాయి రాజేష్ సంతోషం వ్యక్తం చేశారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ ‘ఇవాళ నేను పాన్ ఇండియా స్టార్‌తో సినిమా చేస్తున్నానంటే అది చిరంజీవి గారు ఇచ్చిన ప్రోత్సాహమే. ఆయన అభిమానులమైన నేను, సాయి రాజేష్, ఎస్కేఎన్ కలిసి చేసిన సినిమాను ఆయన బ్లెస్ చేయడం సంతోషంగా ఉంది’ అన్నాడు.
నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ ‘ ఈ సక్సెస్ క్రెడిట్ అంతా చిరంజీవి గారిదే. ఆయన లేకుంటే నేను, సాయి రాజేష్, మారుతి లేము’ అని చెప్పాడు. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్, డీవోపీ బాల్ రెడ్డి, ఎడిటర్ విప్లవ్, సంపూర్ణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.