రాజకీయాలకు దూరంగా ఉన్నా నాపై విమర్శలు ఆగడం లేదు : చిరంజీవి

రాజకీయాలకు దూరంగా ఉన్నా  నాపై విమర్శలు ఆగడం లేదు : చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి  ( Chiranjeevi ) మళ్లీ రాజకీయల్లోకి వస్తున్నారంటూ పుకార్లు షికార్ చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాలపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా.. కొందరు నాపై అవాకులు చవాకులు పేలుతున్నారని ఘాటుగా స్పందించారు.

హైదరాబాద్ లో ఫీనిక్స్ పౌండేషన్ ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు.  సోషల్ మీడియాలో నాపై వచ్చే విమర్శలకు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు.  నేను చేసిన మంచే మాట్లాడుతుందని అన్నారు.  నేను చేసిన సేవా కార్యక్రమాలు, పంచిన ప్రేమాభిమానాలే నాకు రక్షణగా నిలుస్తాయని చెప్పారు.

తనపై రాజకీయ విమర్శలు చేసిన ఒక నాయకుడిని రాజమండ్రిలో ఒక మహిళ అడ్డుకుని నిలదీసిందని, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా తన బిడ్డ ప్రాణాలు నిలిచాయని ఆమె చెప్పిందని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఈ సంఘటన తనకు ఎంతో భావోద్వేగాన్ని కలిగించిందని, తాను చేసే మంచే తనపై వచ్చే విమర్శలకు సమాధానం అని ఆయన చెప్పారు. 

రక్తదానం ద్వారా మరొకరి ప్రాణాలు నిలపవచ్చని చిరంజీవి అన్నారు. ఫ్యాన్స్ ని ఏదో విధంగా వాడుకోవడం కన్నా.. ఇలా రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడి ఆ అనుభూతిని పొందాలని అనుకున్నానని చెప్పారు. తన ఫ్యాన్స్  దాదాపు 27 ఏళ్లుగా బ్లడ్ డొనేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని తెలిపారు.

 

ప్రస్తుతం చిరంజీవి సినిమా వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర మూవీలో నటిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.