టాలీవుడ్ లో సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్' సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. ప్రజలపై భారం వేసేలా నిర్ణయాలు తీసుకోవడంపై న్యాయస్థానం సీరియస్ అయ్యింది. ఇష్టప్రకారం నిర్ణయం తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.
హోమ్ సెక్రటరీ, సి.వి ఆనంద్‌లకు కంటెంప్ట్ నోటీసులు
కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ టికెట్ ధరల పెంపునకు సహకరించారన్న ఆరోపణలపై హోమ్ శాఖ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సి.వి ఆనంద్‌కు హైకోర్టు కోర్టు ధిక్కరణ (Contempt of Court) నోటీసులు జారీ చేసింది. గతంలో 'అఖండ 2', 'రాజా సాబ్' వంటి సినిమాల విడుదల సమయంలోనూ టికెట్ల ధరల పెంపులపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ మళ్లీ అదే పునరావృతం కావడంపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు.
ఏమిటీ వివాదం?
'మన శంకర్ వరప్రసాద్' సినిమా టికెట్ రేట్ల పెంపు అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకురాకుండా గోప్యంగా ఉంచారని పిటిషనర్ విజయ్ గోపాల్ కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం చిట్టచివరి నిమిషంలో మెమోలు జారీ చేసింది. దీంతో సామాన్యులు న్యాయపోరాటం చేసే అవకాశం లేకుండా పోతోందని వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. ప్రభుత్వ తీరును తప్పుబట్టింది.
హైకోర్టు కీలక ఆదేశాలు..
సినిమా టికెట్ల పెంపుపై జరుగుతున్న ఈ నిరంతర నాటకానికి చెక్ పెట్టేందుకు హైకోర్టు ఒక విప్లవాత్మకమైన ఆదేశాన్ని ఇచ్చింది. ఇక మీదట ఏ సినిమాకైనా టికెట్ రేట్లు పెంచాలనుకుంటే.. ఆ నిర్ణయాన్ని సినిమా విడుదలకు 90 రోజుల ముందే తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. సినిమా విడుదలకు ఒక రోజు ముందో, అర్థరాత్రో 'స్పెషల్ మెమోలు' జారీ చేసి ధరలు పెంచడం ఇకపై కుదరదని హెచ్చరించింది. సినిమా బడ్జెట్ ఎంత ఉన్నా, సామాన్య ప్రేక్షకుడి జేబుకు చిల్లు పడకుండా నిబంధనల ప్రకారమే ధరలు ఉండాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
►ALSO READ | RashmikaVijay: విజయ్‌తో పెళ్లిపై రష్మిక క్లారిటీ.. అసలు నిజం చెప్పేసిందిగా!
ఎందుకు ఈ నిర్ణయం?
సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు నిర్మాతలు భారీ లాభాల కోసం టికెట్ ధరలు రూ. 50 నుండి రూ. 150 వరకు పెంచుకుంటూ వస్తున్నారు. అయితే, ఈ పెంపునకు సరైన చట్టబద్ధత లేదని, హోమ్ శాఖకు ఇటువంటి పెంపులు చేసే అధికారం లేదని హైకోర్టు గతంలోనే పేర్కొంది. తాజాగా 'మన శంకర వరప్రసాద్' విషయంలో కూడా అదే పునరావృతం కావడంతో కోర్టు ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీసుకున్న ఈ '90 రోజుల ముందస్తు నిర్ణయం' నిబంధన సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. ఇది నిర్మాతలకు ఇబ్బందిగా మారినప్పటికీ, సామాన్య ప్రేక్షకుడికి మాత్రం పెద్ద ఊరటనిచ్చే విషయమే. మరి ఈ వివాదంపై ప్రభుత్వం, సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి!
