చిట్టీల పేరిట రూ.4 కోట్లు టోకరా... 48 మందిని మోసం చేసిన నిందితుడు అరెస్ట్

చిట్టీల పేరిట  రూ.4 కోట్లు టోకరా... 48 మందిని మోసం చేసిన నిందితుడు అరెస్ట్

చేవెళ్ల, వెలుగు : చిట్టీల పేరిట 48 మంది నుంచి రూ.4 కోట్లు వసూలు చేసి ఊడాయించిన నిందితుడిని శంకర్​పల్లి పోలీసులు అరెస్ట్​ చేశారు. శంకర్​పల్లి రైల్వే స్టేషన్ రోడ్డు వైపు ఉండే  సుధాకర్,  అతడి భార్య లక్ష్మి, మరికొందరితో కలిసి చిట్టీల వ్యాపారం ప్రారంభించామని, ప్రతినెలా డబ్బులు కడితే ఆకర్షణీయమైన వడ్డీ, అధిక లాభాలు వస్తాయని నమ్మబలికారు. 

ఇలా 2021 నుంచి 2024 వరకు 48 మంది నుంచి  ప్రతినెలా రూ.15 వేల నుంచి రూ.30 వేల చొప్పున రూ.4 కోట్ల వరకు వసూలు చేశారు. చిట్టీ ఎత్తిన తర్వాత ఆ డబ్బులు ఇవ్వకుండా వడ్డీ ఎక్కువ ఇస్తామని వారి దగ్గరే ఉంచుకునేవారు. కొద్ది రోజులు ఇచ్చినట్టే నటించి తర్వాత డబ్బులు కట్టించుకున్న 48 మందికి ఇవ్వలేదు.. తర్వాత  2024 జూన్ నుంచి కనిపించకుండా పోయాడు. బాధితులు సుధాకర్​ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు ఎన్నో చోట్ల ఆరా తీశారు. 

దీంతో బాధితుల్లో ఒకరైన పర్సి అశ్విన్ ఆన్​లైన్​ ద్వారా సుధాకర్​కు రూ.6.60 లక్షలు చెల్లించానని, తన డబ్బులు తనకు ఇప్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీఐ రుద్వీర్ కుమార్, ఆయన టీమ్​నిందితుడిని శంకర్ పల్లిలో గురువారం అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. కేసులో బాధితుల వివరాలు సేకరించడంతో పాటు  మిగితా వ్యక్తుల ప్రమేయంపైనా విచారణ కొనసాగుతోందని సీఐ తెలిపారు.