చిత్రలహరి టీజర్ : అప్పుడు పాటలు.. ఇప్పుడు పాత్రలు

చిత్రలహరి టీజర్ : అప్పుడు పాటలు.. ఇప్పుడు పాత్రలు

దూరదర్శన్ లో 1990ల్లో ప్రతి శుక్రవారం రాత్రి వచ్చే చిత్రలహరి ప్రోగ్రామ్ ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే టైటిల్ తో ఇప్పుడో సినిమా వస్తోంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా… కల్యాణి ప్రియదర్శన్, నివేద పెతురాజ్, సునీల్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకుడు. నేను శైలజతో హిట్టుకొట్టి… ఉన్నది ఒక్కటే జిందగీతో యూత్ ను ఆకట్టుకుని.. ఇపుడు చిత్రలహరిని ముస్తాబు చేశారు డైరెక్టర్ కిశోర్ తిరుమల. తెలుగులో ఇది ఆయనకు నాలుగో సినిమా.

చిత్రలహరి టైటిలే కాదు.. టీజర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. కిశోర్ తిరుమల స్టైల్ లో ఉంది. ఆయన సినిమాల్లో హీరో గడ్డంతో కనిపిస్తుంటాడు. ఇందులో సాయి ధరమ్ తేజ్ పాత్ర కూడా అలాగే గడ్డంతో కనిపిస్తోంది. టీజర్ లో హీరో, ఇద్దరు హీరోయిన్లు, సునీల్ పాత్రలను పరిచయం చేశారు.

ఆనాటి చిత్రలహరి ప్రోగ్రామ్ లో పాటలు.. ఇప్పటి చిత్రలహరి సినిమాలో పాత్రలు అంటూ.. ఆకట్టుకునే కనెక్టివిటీతో టీజర్ మొదలవుతుంది. “మగాళ్లంతా ఒక్కటే. మనల్ని రీచ్ అయ్యేంతవరకు ఒకలా ఉంటారు. మనల్ని రీచ్ అయ్యాక అందరూ ఒకేలా ఉంటారు” “మంచిరోజు ఆదివారం పూట రమ్మను బాబాయ్.. ఇంటిదగ్గర ఖాళీగా ఉంటాను” లాంటి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. వైన్ షాప్ లో ఐదు రూపాయల చిల్లర కోసం మూంగ్ దాల్ ప్యాకెట్ సునీల్ రిటర్న్ ఇచ్చే సీన్ హిలేరియస్ గా ఉంది. టీజర్ లో కిశోర్ తిరుమల మార్క్ కనిపిస్తుంది. దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ సినిమా మూడ్ కు తగ్గట్టుగా ఉంది. మూవీని ఏప్రిల్ 12న విడుదల చేస్తున్నారు.