‘పేట, కొడంగల్’ ఎత్తిపోతలకు అనుమతులు ఉన్నాయా? : మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి

‘పేట, కొడంగల్’ ఎత్తిపోతలకు అనుమతులు ఉన్నాయా? : మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
  • మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి

మక్తల్ , వెలుగు : నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కేంద్ర జల సంఘం అనుమతులు ఉన్నాయా అని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం నారాయణపేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం కమీషన్ల కోసమే ప్రభుత్వం ఈ పనులను హడావుడిగా చేపడుతోందని విమర్శించారు. భూములు కోల్పోతున్న రైతులకు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించలేదని, వారికి న్యాయం చేసిన తర్వాతే పనులు మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్ర బడ్జెట్ అంతా అంకెల గారడీయేనని, మక్తల్ - నారాయణపేట ఫోర్ లేన్ రోడ్డుకు శంకుస్థాపన చేసి మూడు నెలలు గడిచినా ఇప్పటికీ అతీగతీ లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతిపాదించిన 'హమ్' విధానంలో 60 శాతం నిధులు కాంట్రాక్టర్లే భరించాలన్న నిబంధన వల్ల ఎవరూ ముందుకు రావడం లేదని ఎద్దేవా చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో హడావుడి చేస్తున్న ప్రభుత్వం, వాటికి నిధులు కేటాయించలేదని.. అలాగే గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.