చంద్రబాబు కస్డడీ పిటిషన్ తీర్పు వాయిదా.. సెప్టెంబర్ 22న వెల్లడి

చంద్రబాబు కస్డడీ పిటిషన్ తీర్పు  వాయిదా.. సెప్టెంబర్ 22న వెల్లడి

చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్ పై తీర్పు మళ్లీ వాయిదా పడింది. సెప్టెంబర్ 22వ తేదీ శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వెల్లడిస్తామని విజవాడ ఏసీబీ కోర్టు తెలిపింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ (Skill development scam) కేసులో.. టీడీపీ అధినేత చంద్రబాబును  ఐదు కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా..చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, అగర్వాల్‌ వాదనలు వినిపించారు.

సీఐడీ వాదనలు...

స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు  అన్ని ఆధారాలతోనే అరెస్ట్ చేశారు అని సీఐడీ తరపు న్యాయవాది పొన్నవోలు వాదించారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న ప్రతీ ఒక్కరినీ మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని కోర్టులో వాదించారు. కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికి తీయడమే అసలు ఉద్దేశమన్నారు. చంద్రబాబును కస్టడీకి ఇస్తే మరిన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏఏజీ వాదనలు వినిపించారు. స్కిల్ స్కాం తీవ్రమైనఆర్థిక నేరమని సీఐడీ తరపు న్యాయవాది పొన్నవోలు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో చంద్రబాబే కీలకపాత్రపోషించారంటూ.. ఇద్దరు సాక్ష్యులను ప్రశ్నిస్తే చంద్రబాబు పాత్ర బయటపడిందన్నారు.  ఈ కేసులో నిజాలు రాబట్టడమే సీఐడీ లక్ష్యమని కాని చంద్రబాబుకు హాని కలిగించే ఉద్దేశం సీఐడీకి లేదని పొన్నవోలు కోర్టుకు తెలిపారు. 

చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు..

సీఐడీ తరపు వాదనలతో చంద్రబాబు న్యాయవాది లూధ్ర (Ludhra) విభేదించారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అవినీతి చేసినట్లు ఎక్కడా ఆధారాలు లేవని.. ఆయన అరెస్టు ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్నారు లూథ్రా. ఎన్‌ఎస్‌జీ భద్రత ఉన్న వ్యక్తిని విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడమే కాకుండా.. కస్టడీకి కోరటం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు రాజకీయ కుట్రతోనే జరిగిందని.. సీఐడీ విచారణలో కొత్త కోణం ఇప్పటిదాకా బయట పడలేదని ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు చంద్రబాబు తరపు లాయర్ లూద్రా. విచారణ పేరుతో చంద్రబాబును సీఐడీ అధికారులు వేధించారని కోర్టుకు తెలిపారు.  సీఐడీ ఓ లక్ష్యంతోనే చంద్రబాబును కస్టడీ కోరుతుందని వాదించారు.

రెండు వర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు.. సీఐడీ కస్టడీ పిటీషన్ పై నిర్ణయాన్ని సెప్టెంబర్ 22వ తేదీకి వాయిదా వేసింది.