
గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గచ్చిబౌలి రాడిసన్ హోటల్‌లో ఫిబ్రవరి 24న డ్రగ్స్ పార్టీ జరగగా, అక్కడికి వెళ్లిన వారిలో డ్రగ్స్‌ను గుర్తించేందుకు సైబరాబాద్ పోలీసులు క్రోమటోగ్రఫీ పరీక్షలు నిర్వహిచేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని కోసం కూకట్‌పల్లి కోర్టు నుంచి అనుమతులు తీసుకునేందుకు ప్రయత్నించగా పర్మిషన్ రాలేదు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మొత్తం 14 మందిని నిందితులుగా పోలీసులు గుర్తించారు.
వీరిలో ముగ్గురికి మాత్రమే డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చింది. మిగిలిన వారు పోలీసు విచారణకు కొన్ని రోజుల పాటు గ్యాప్ తీసుకొని రావడంతో వారిలో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో వీరి శరీరాల్లో డ్రగ్స్ అనవాళ్లు గుర్తించేందుకు క్రోమోటోగ్రఫీ పరీక్షలు నిర్వహించాలని సైబరాబాద్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కోర్టు నుంచి అనుమతులు రాగానే ఈ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని పోలీసులు తెలిపారు.