మంత్రి జగదీశ్​రెడ్డి పర్యటనలో కనిపించిన సీఐ నాగార్జున గౌడ్​

మంత్రి జగదీశ్​రెడ్డి పర్యటనలో కనిపించిన సీఐ నాగార్జున గౌడ్​

సూర్యాపేట వెలుగు:  మెదక్​ జిల్లా రామాయంపేట తల్లీకొడుకుల సూసైడ్​ ఘటనలో  ఏ7గా ఉన్న  సీఐ నాగార్జున గౌడ్ డ్యూటీలో జాయిన్​అయ్యారు. ఈ కేసులో మిగిలిన ఆరుగురు నిందితులు కోర్టు విచారణను ఎదుర్కొంటూ నిజామాబాద్​జిల్లా జైలులో ఉండగా, ఇన్నాళ్లూ పరారీలో ఉన్న సీఐ మాత్రం బుధవారం సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్​రెడ్డి పాల్గొన్న ఓ కార్యక్రమంలో ప్రత్యక్షం అయ్యారు. ఏడుగురు వ్యక్తుల వల్లే తాము చనిపోతున్నామంటూ మృతుడు సంతోష్​ సూసైడ్​కు ముందు నిందితుల పేర్లు, ఫొటోలను ఫేస్​బుక్​లో పోస్ట్​ చేశాడు. సెల్ఫీ వీడియో, సూసైడ్​ నోట్ ఆధారంగా పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. వీరిలో తుంగతుర్తి సీఐ నాగార్జున గౌడ్​ ఏ7గా ఉన్నారు. 

పరారీలో ఉన్న సీఐ డ్యూటీలో ప్రత్యక్షం

ఈ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితులను ఇప్పటికే కామారెడ్డి పోలీస్​స్టేషన్​లో లొంగిపోయారు. కేసులో సీఐ నాగార్జున గౌడ్​ పేరు బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన కనిపించకుండా పోయారు. ఆరుగురు నిందితులు కామారెడ్డిలో లొంగిపోయిన రోజే నాగార్జున గౌడ్​ కూడా లొంగిపోతారని ప్రచారం జరిగినా లొంగిపోలేదు. దీంతో ఆరుగురు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు, సీఐ నాగార్జునగౌడ్​ను పరారీలో ఉన్నట్లు చూపుతూ వచ్చారు. మరోవైపు ఆరుగురు నిందితులకు జుడిషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో ప్రస్తుతం వీరంతా నిజామాబాద్​జైలులో ఉన్నారు. మరోవైపు సీఐ నాగార్జున గౌడ్​పై పోలీస్​ఉన్నతాధికారులు కనీసం శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోలేదు. దీంతో నాలుగు రోజుల క్రితమే ఆయన తుంగతుర్తి పోలీస్ స్టేషన్ లో  డ్యూటీలో రీ జాయిన్ అయ్యారు. బుధవారం మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్న ఓ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు. నూతనకల్​ మండలంలోని పిల్పకుంట్ల గ్రామంలో జరిగిన వివేకానంద విగ్రహావిష్కరణలో మంత్రి పాల్గొనగా, సీఐ నాగార్జున గౌడ్​ బందోబస్తు డ్యూటీలో పాల్గొన్నారు.