
యాదాద్రి, వెలుగు : భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీతపై సీఐడీ ఎంక్వైరీ జరిపించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ట్రిపుల్ఆర్ అలైన్మెంట్మార్పు కోసం ఆందోళన చేసి జైలుకు పోయొచ్చిన రైతులను యాదాద్రి జిల్లా రాయగిరిలో టీపీసీసీ జనరల్ సెక్రెటరీ బీర్ల అయిలయ్యతో కలిసి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండలు, గుట్టలు, భూదాన్, అసైన్డ్ ల్యాండ్స్‌ను ఎమ్మెల్యేలు కొన్నారని ఆరోపించారు. ‘ఈ సర్కారు ఉండేది ఆరునెలలే. దానికి పోయే కాలమొచ్చింది. అందుకే ఓఆర్ఆర్అమ్మేసి, రైతులకు బేడీలు వేశారు’ అని అన్నారు. ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్‌ను అడ్డం పెట్టుకొని రూ.వేల, లక్షల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు.
యాదాద్రి డీసీపీని ఉద్దేశించి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలతో డీసీపీ ప్రెస్‌మీట్‌పెట్టి వారు రైతులు కాదంటూ స్టేట్మెంట్ఇచ్చారని, రైతులను పట్టుకొని కాదని ఎలా అంటావని, స్టేట్మెంట్ వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి కామెంట్లు చేస్తే డీసీపీ అని కూడా చూడమన్నారు. ‘ఆందోళన చేసిన రైతులపై కేసులు ఏమైనా ఉన్నాయా? వాళ్లను జైలుకు పంపించి, బేడీలు వేస్తారా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో ఒక్కడు కూడా పనికి రాడు. ఏ ఒక్కడూ గెలవడు’ అని ఘాటుగా కామెంట్ చేశారు.
ఉమ్మడి జిల్లాకు మంత్రి ఉన్నా.. లేనట్టే అని అన్నారు. కుంటలు మింగి, జాగలు కబ్జా చేయడం తప్పా ఆయనకేం తెలియదన్నారు. ఈ చిన్న రైతుల దగ్గరే తక్కువ రేటుకు వందలాది ఎకరాలను ఎమ్మెల్యేలు, లీడర్లు కొని భూస్వాములయ్యారన్నారు. ట్రిపుల్ ఆర్ కోసం భూ సేకరణ రాష్ట్రం పరిధిలోని అంశమని, అందుకే వంగపల్లి మీదుగా వెళ్లాల్సిన ట్రిపుల్ ఆర్ రాయగిరికి మారిందని ఆరోపించారు. ఇక నుంచి రైతులకు సమస్య వస్తే తానే ముందుండి జైలుకు వెళ్తానన్నారు.