ధరణి అక్రమాలపై సీఐడీ దూకుడు..సిట్ అదుపులో తొమ్మిది మంది ఆపరేటర్లు

ధరణి అక్రమాలపై సీఐడీ దూకుడు..సిట్ అదుపులో తొమ్మిది మంది ఆపరేటర్లు
  •     రంగారెడ్డి, యాదాద్రి, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో సోదాలు
  •     బీఆర్ఎస్ హయాంలో అనధికారిక లాగిన్‌‌లు, రికార్డుల ట్యాంపరింగ్
  •     స్పెషల్ ఎంక్వైరీ టీమ్ నివేదిక ఆధారంగా తనిఖీలు
  •     కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్.. బిగుస్తున్న ఉచ్చు

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో జరిగిన ధరణి పోర్టల్ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు ప్రారంభించింది. రంగారెడ్డి, జనగామ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో గురువారం నుంచి సోదాలు నిర్వహిస్తోంది. తహసీల్దార్ కార్యాలయాల్లో ధరణి పోర్టల్ ప్రొసీడింగ్స్‌‌లో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన 9 మంది ఆపరేటర్లను అదుపులోకి తీసుకుని, హైదరాబాద్‌‌లోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి తరలించింది. ధరణి పోర్టల్ కేంద్రంగా జరిగిన అక్రమాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎంక్వైరీ టీమ్ (సెట్) ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఐడీ సిట్ తాజా సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. 

ప్రధానంగా తహసీల్దార్ ఆఫీసుల్లోని ధరణి పోర్టల్ ద్వారానే ప్రొసీడింగ్స్, రికార్డుల ట్యాంపరింగ్ జరిగినట్లు గుర్తించిన సిట్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో కలిసి దర్యాప్తు చేస్తోంది. శనివారం కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉందని, మరికొంత మందిని అదుపులోకి తీసుకోవచ్చని సీఐడీకి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.

ధరణిపై స్పెషల్ ఎంక్వైరీ టీమ్ (సెట్) రిపోర్ట్

భూ రికార్డుల నిర్వహణ కోసం తెచ్చిన ధరణి పోర్టల్‌‌ను అడ్డుపెట్టుకుని గత సర్కారు హయాంలో భారీ అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం మొదటి నుంచీ అనుమానిస్తోంది. ప్రభుత్వ, వివాదాస్పద భూముల రికార్డుల ట్యాంపరింగ్, అక్రమ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, చలాన్లను పక్కదారి పట్టించడం ద్వారా పలువురు ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు ఆపరేటర్లు అక్రమాలకు పాల్పడినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా గుర్తించింది. సమగ్ర దర్యాప్తు కోసం చీఫ్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారులతో పాటు సీఐడీ ఉన్నతాధికారులతో స్పెషల్ ఎంక్వైరీ టీమ్ (సెట్) ఏర్పాటు చేసింది. ధరణి సాంకేతిక వ్యవస్థ దుర్వినియోగం వంటి అంశాలపై సెట్ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ప్రైవేటు సంస్థల నిర్వాహకులు, ఆన్‌‌లైన్ సర్వీస్ సెంటర్లు, మీ–సేవ కేంద్రాల నిర్వాహకులు, మధ్యవర్తులతో పాటు పలువురు అధికారుల పాత్ర కూడా ఉందని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.

సెట్ నివేదిక ఆధారంగా రంగంలోకి సీఐడీ సిట్

సెట్​ నివేదిక ఆధారంగా సీఐడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ రంగంలోకి దిగింది. ధరణి పోర్టల్ ద్వారా అక్రమాలు, అనుమానాస్పద లావాదేవీలు జరిగిన తహసీల్దార్ ఆఫీసుల్లో తనిఖీలు చేస్తోంది. భూముల యాజమాన్య వివరాల్లో మార్పులు, రికార్డుల సవరణల అవకతవకలపై అధికారులు దృష్టి సారించారు. రెవెన్యూ అధికారుల సహకారంతో అక్రమాలకు బాధ్యులైన ఆపరేటర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సీఐడీ చేతిలో పోర్టల్ రూపకల్పన, సాఫ్ట్‌‌వేర్, లాగిన్‌‌ల గుట్టు!

ధరణి పోర్టల్‌‌లో జరిగిన అనుమానాస్పద లావాదేవీల్లో కొన్నింటికి ఉన్నతస్థాయి అధికారిక లాగిన్లు ఉపయోగించినట్లు ఆడిట్‌‌లో తేలినట్లు సమాచారం. దీనిపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పోర్టల్ టెండర్ల కేటాయింపులో నిబంధనలు పాటించా రా? సాఫ్ట్‌‌వేర్ రూపకల్పన, నిర్వహణలో ప్రైవేటు సంస్థల పాత్ర ఏమిటన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రభుత్వ, అసైన్డ్ భూముల రికార్డుల్లో మార్పులు, ప్రభుత్వ ఉద్యో గులు, ప్రైవేటు ఆపరేటర్లు, మధ్యవర్తుల పాత్ర, అక్రమంగా లబ్ధి పొందిన వ్యక్తులు, సంస్థల వివరాలు, సెట్ ఇచ్చిన రిపోర్ట్ మేరకు బాధ్యు లపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సీఐడీ రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.

22వేల లావాదేవీలు అనుమానాస్పదం
ధరణి పోర్టల్ అక్రమాలపై ప్రభుత్వం చేపట్టిన పరిశీలనలో ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ కీలకంగా మారినట్లు తెలిసింది. 2020 అక్టోబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు జరిగిన సుమారు 8 లక్షల భూ లావాదేవీల్లో దాదాపు 22 వేల లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నట్లు సమాచారం. వీటిలో అసైన్డ్ భూముల హక్కుల బదిలీలో నిబంధనల ఉల్లంఘన, ప్రభుత్వ, నిషేధిత భూములను ప్రైవేటు వ్యక్తుల పేర్లపైకి మార్చడం తదితర అంశాలపై సీఐడీ సిట్ ఆధారాలు సేకరిస్తోంది. ఈ క్రమంలోనే అవకతవకలను గుర్తించి బాధ్యులైన ధరణి ఆపరేటర్లను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుంటున్నారు. కాగా, ఈ వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో కీలక పదవుల్లో కొనసాగిన పలువురు ఉన్నతాధికారుల చుట్టూ సిట్ ఉచ్చు బిగుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.