సిరివెన్నెల మృతికి సినీ ప్రముఖుల నివాళి

సిరివెన్నెల మృతికి సినీ ప్రముఖుల నివాళి

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో తెలుగు సినిమా చిన్నబోయింది. ఒక గొప్ప రచయితను కోల్పోయామని తెలుగు సినీ రంగం మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

దర్శకుడు విశ్వనాథ్
సీతారామశాస్త్రి మరణం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. నమ్మలేని నిజం ఇది. బాలసుబ్రహ్మణ్యం పోయినప్పుడు నా కుడి భుజం పోయింది. ఇప్పుడు నా ఎడమ భుజం పోయింది.

మోహన్ బాబు
సిరి వెన్నెల సీతారామశాస్త్రి నాకు అత్యంత సన్నిహితుడు. సరస్వతీ పుత్రుడు... విధాత తలపున ప్రభవించిన సాహిత్య శిఖరం నేలకొరిగింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.

చిరంజీవి
'సిరివెన్నెల' మనకిక లేదు. సాహిత్యానికి ఇది చీకటి రోజు. నడిచి వచ్చే నక్షత్రంలా ఆయన స్వర్గద్వారాల వైపు సాగిపోయారు. మనకి ఆయన సాహిత్యాన్ని కానుకగా ఇచ్చి వెళ్లారు. తరలిరాదా తనే వసంతం, తన దరికి రాని వసంతాల కోసం అనే పాటలాగా.. ఆయన మన అందరినీ వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

జానియర్ ఎన్టీఆర్
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. అలుపెరుగక రాసిన ఆయన కలం నేడు ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం అందరికీ చిరస్మరణీయంగా నిలిచివుంటాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని మనసారా ప్రార్థిస్తున్నాను.

వెంకటేష్
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరనే వార్త విని నిరుత్సాహానికి గురయ్యాను. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక.

నంద‌మూరి బాల‌కృష్ణ‌
సినిమా పాట‌కు సాహిత్య గౌర‌వాన్ని క‌లిగించిన వ్య‌క్తి సిరివెన్నెల గారు. తెలుగు పాట‌ని త‌న సాహిత్యంతో ద‌శ‌దిశ‌ల వ్యాపింప‌జేసిన ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రిగారు. నాకు ఎంతో ఆప్తులు. నేను న‌టించిన చిత్రాల‌కు వారు అద్భుత‌మైన పాట‌లు రాయ‌డం జ‌రిగింది. ఆయ‌న‌ ఈ రోజు మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం చాలా భాధాక‌రం. వారి ప‌విత్ర ఆత్మ‌కు శాంతి చేకూర్చాల‌ని ఆ భ‌గ‌వంతున్ని కోరుకుంటూ.. వారి కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను.

నాగబాబు
గొప్ప ప్రతిభ, అంతకు మించి గొప్ప వ్యక్తిత్వం.. రెండూ ఒకే దేహంలో ఇమిడిన వ్యక్తివి నువ్వు అన్నయ్య. అందర్ని వదిలిపెట్టి వెళ్లిపోయావ్. నువ్వు రాసిన ప్రతీ పాట, ప్రతీ మాట ఎప్పటికి మాతో ఉంటాయి. వాటిని ఆచరించే మాలో నువ్వు ఉంటావు.

ప్రకాశ్ రాజ్
జగమంత కుటుంబం మీది.. మీరు లేక ఏకాకి జీవితం మాది...

కళ్యాణ్ రామ్
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ప్రార్థిస్తున్నాను.

వంశీ శేఖర్
సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి గారు చివ‌ర‌గా నాని హీరోగా న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్ సినిమాలో రెండు పాట‌లు రాయ‌డం జ‌రిగింది. అవే ఆయన చివ‌రి పాట‌లు కావ‌డం విషాద‌క‌రం.

కోన వెంకట్
అక్షరానికి అన్యాయం చేసి, సాహిత్యాన్ని ఒంటరి చేసి అందనంత దూరం వెళ్లిపోయిన మహాకవి, మహా మనీషి గురువు గారు సీతారామశాస్త్రి గారికి కన్నీటి వీడ్కోలు.

సాయిధరమ్ తేజ్
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని కోల్పోయినందుకు దిగ్భ్రాంతి మరియు బాధ కలిగింది. సాహితీ ప్రపంచానికి మరియు తెలుగు సినిమా రంగానికి మీరు చేసిన కృషి మరువలేనిది సార్.
ఈ బాధ ఎప్పటికీ మనతోనే ఉంటుంది.

అల్లరి నరేష్
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ఆయన మొదటి నుంచి నా కెరీర్‌లో భాగమయ్యాడు. ఆయన మాటలు మన సంగీతంలో శాశ్వతంగా ఆయనను బతికి ఉంచుతాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని కోరుతున్నాను.

అనిల్ రావిపూడి
తెలుగు సాహిత్య శిఖరం... సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. అజ్ఞానపు చీకటిని తన అక్షర కిరణాలతో వెన్నెలగా మార్చిన సిరివెన్నెల గారికి కన్నీటి వీడ్కోలు.

రవితేజ
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మృతి చెందడం బాధాకరం. తెలుగు సినిమాకు ఆయన చేసిన కృషి ఎనలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక.

శ్రీను వైట్ల
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు నిజమైన లెజెండ్. ఆయన తెలుగు సినిమా సాహిత్యాన్ని బహుముఖ మరియు ఉన్నత స్థాయి సాహిత్యంతో సుసంపన్నం చేశారు. అలాంటి గొప్ప వ్యక్తితో నా అనుబంధాన్ని నేను ఎప్పుడూ ఆదరిస్తాను. ఆయన కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.

బండ్ల గణేష్
గురూజీ , అందర్ని వదిలిపెట్టి వెళ్లిపోయావ్... నువ్వు రాసిన ప్రతీ పాట, ప్రతీ మాట ఎప్పటికి మాతో ఉంటాయి. వాటిని ఆచరించే మాలో నువ్వు ఉంటావు.

నాని
ఆయన సాహిత్యంలోని సిరివెన్నెల మన మనసుల మీద ఎప్పటికీ అలానే వుంటుంది. వీడుకోలు గురువు గారూ..

నితిన్
సిరివెన్నెలసీతారామశాస్త్రి గారి మరణవార్త తెలిసి దిగ్భ్రాంతి చెందాను. సంగీతానికి మీ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. రెస్ట్ ఇన్ పీస్ సార్.

సురేష్ ప్రొడక్షన్స్, సితారా ఎంటర్ టైన్మెంట్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు తమ సంతాపాన్ని ప్రకటించాయి.