
టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. గత మూడు రోజులుగా సినిమా షూటింగ్స్ నిలిచిపోవడంతో సినీ పరిశ్రమలో అనిశ్చితి నెలకొంది. తమ వేతనాలు పెంచే వరకు వెనక్కి తగ్గేది లేదని ఫిలిం ఫెడరేషన్ నాయకులు హెచ్చరిస్తున్నారు. అటు కార్మికుల డిమాండ్లను తలొగ్గేది లేదని నిర్మాత మండలి స్పష్టం చేస్తోంది.
కార్మికుల 30 శాతం వేతనాల పెంపుపై ఇప్పటికే పలుమార్లు నిర్మాతలకు , ఫెడరేషన్ నాయకుల మధ్య చర్చలు జరిగాయి. కానీ చర్చలు కొలిక్కి రాకపోవడంతో మంగళవారం మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. నిర్మాతలతో చర్చలు జరిపారు. మూడు రోజుల్లో ఇరు వర్గాలు చర్చించుకుని సమస్యని పరిష్కరించుకోవాలని సూచించారు. అప్పటికీ సమస్య ఇలానే కొనసాగితే తన నిర్ణయం చెబుతానని చెప్పారు. అయినా ఫెడరేషన్ నాయకులు మాత్రం వేతనాల పెంపుపై వెనక్కి తగ్గలేదు.
ఈ నేపథ్యంలో ఈ రోజు ( ఆగస్టు 6, 2025 ) ప్రసాద్ ల్యాబ్ లో 'అఖండ 2' మూవీ డబ్బింగ్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. టాలీవుడ్ సినీ పరిశ్రమలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను వివరించారు. ఫిలిం ఫెడరేషన్ డిమాండ్స్ ను బాలయ్య దృష్టికి మైత్రీ రవి, ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, నిర్మాత గోపినాథ్ ఆచంట, దామోదర ప్రసాద్ తీసుకెళ్లారు. వేతనాల పెంపుపై యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయాలను బాలకృష్ట తెలియజేశారు.
ఈ సందర్భంగా ప్రతి హీరో సంవత్సరానికి ఎక్కువ సినిమాలు చెయ్యాలి అని బాలకృష్ణ చెప్పినట్లు నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ తెలిపారు. నేను సంవత్సరానికి 4 సినిమాలు చేస్తాను, నిర్మాణ వ్యయం పెరగకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి అని, కార్మికులు కూడా పరిశ్రమలో బాగామే, త్వరలో సమస్యలు తొలగిపోతాయి అని బాలకృష్ణ అన్నారని నిర్మాతలు చెప్పారు.
తమ వేతానాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మికులు షూటింగ్స్ బంద్ కు పిలుపునిచ్చింది . గత మూడు రోజులుగా మొత్తం 24 క్రాప్ట్ లకు చెందిన కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. వేతనాలు పెంచే వరకు వెనక్కి తగ్గేది లేదని ఫిలిం ఫెడరేషన్ తేల్చిచెప్పింది. అటు కార్మికుల డిమండ్స్ ను నిర్మాతల మండలి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇతర సినీ పరిశ్రమలతో పోల్చితే తెలుగు కార్మికులకు అధిక వేతాలు ఇస్తున్నామని పేర్కొంటున్నారు. అవసరమైతే యూనియన్‌లో లేని నైపుణ్యం ఉన్న కార్మికులను కూడా షూటింగ్‌ల కోసం నియమించుకోవచ్చని నిర్మాతల మండలి ప్రకటించింది. సినీ ఇండస్ట్రీలో పెద్దల జోక్యంతోనైనా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఇరు వర్గాలు ఆశిస్తున్నాయి.