
హైదరాబాద్ : రాష్ర్టంలో అంతర్జాతీయస్థాయిలో సినిమా సిటీ నిర్మించనున్నట్లు తెలిపారు సీఎం కేసీఆర్. శనివారం సినీ ప్రముఖులు చిరంజీవీ, నాగార్జున ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో సినీ ఇండస్ట్రీ డెవలప్ మెంట్, విస్తరణపై సీఎం కేసీఆర్ తో చర్చించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. హైదరాబాద్ నగర శివారులో 1500 నుంచి 2000 ఎకరాల స్థలాన్ని కేటాయించనున్నట్లు తెలిపారు. సినీ ప్రముఖులు, అధికారుల బృందం బల్గేరియా వెల్లి అక్కడి సినిమా సిటీని పరిశీలించి రావాలల్సిందిగా సూచించారు. సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం. అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం అయినందున సినిమా షూటింగులు, సినిమా థియేటర్లు పునఃప్రారంభించవచ్చన్నారు.
రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ ఆధారంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారన్నారు. కరోనా క్రమంలో విధించిన లాక్ డౌన్ వల్ల అటు షూటింగులు ఆగిపోయి, ఇటు థియేటర్లు నడవక అనేక మంది ఉపాధి కోల్పోయారన్నారు కేసీఆర్. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న సీఎం.. మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 91.88 శాతం ఉందని.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగులు పునఃప్రారంభించాలన్నారు. థియేటర్లు కూడా ఓపెన్ చేయాలని.. చిత్ర పరిశ్రమపై ఆధారపడి బతికే కుటుంబాలను కష్టాల నుంచి బయట పడేయాలని చెప్పారు. హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి, విస్తరణకు పుష్కలమైన అవకాశాలున్నాయన్న సీఎం.. హైదరాబాద్ నగరం కాస్మో పాలిటన్ సిటీ అన్నారు.
హీరోలు చిరంజీవి, నాగార్జున మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో షూటింగులు ప్రారంభించామన్నారు. త్వరలోనే థియేటర్లు కూడా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.