దేశంలో యుద్ధ వాతావరణం.. హెవీ వాటర్ ప్లాంట్లో మాక్ డ్రిల్

దేశంలో యుద్ధ వాతావరణం.. హెవీ వాటర్ ప్లాంట్లో మాక్ డ్రిల్

మణుగూరు, వెలుగు: రక్షణ రంగానికి చెందిన హెవీ వాటర్ ప్లాంట్లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆదివారం మాక్ డ్రిల్ నిర్వహించారు. దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితిలో అత్యవసర సమయంలో దాడి జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్షణ చర్యలపై ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో ఈ మాక్ డ్రిల్ చేపట్టారు. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలోని ఈ కర్మాగారంలో అణు ఇంధనానికి సంబంధించిన భార జలాన్ని ఉత్పత్తి చేస్తారు.

యుద్ధ సమయాల్లో అణు కర్మాగారాలపై దాడి చేస్తే నష్టం భారీ స్థాయిలో ఉండటం వల్ల  దీనికి పటిష్టమైన భద్రత ఉంటుంది. అత్యవసర సమయంలో రక్షణ చర్యలుట తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు సిబ్బందికి మాక్ డ్రిల్ ద్వారా వివరించారు. ఎమర్జెన్సీ అలారం మోగినప్పుడు కర్మాగార ఉద్యోగులు, సమీప ప్రాంతాల్లోని తమ కుటుంబ సభ్యులు, ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు.ఇందులో సీఐఎస్ఎఫ్ కమాండెంట్ అమిత్ కుమార్, మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, అశ్వాపురం సీఐ జి.అశోక్ రెడ్డి, ఎస్ఐ మధు ప్రసాద్ తోపాటు సీఐఎస్ఎఫ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.