ఫొటోలకు ఫోజులు తగ్గించి పని చేయండి: సీఎం కేసీఆర్

ఫొటోలకు ఫోజులు తగ్గించి పని చేయండి: సీఎం కేసీఆర్

తెలంగాణ పట్టణాలను ఆదర్శంగా మార్చాల్సిన బాధ్యత మేయర్లు, చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై ఉందన్నారు సీఎం కేసీఆర్. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పురపాలక సదస్సులో కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. ఫొటోలకు ఫోజులు తగ్గించి…పచ్చదనం,పారిశుధ్యం పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అధికారం, హోదా వచ్చాక మనిషి మారకూడదని, లేని గొప్పదనాన్ని, ఆడంబరాన్ని తెచ్చుకోవద్దని తెలిపారు. అంతేకాదు ఓవర్ నైట్ లో పనులు చేస్తామని హామీ చేయవద్దని సూచించారు. మీ కర్తవ్యాన్ని నిర్వహించడంలో మీరు విజయం సాధించాలని తెలిపారు. ప్రస్తుతం మున్సిపాలిటీ అంటే మురికి, చెత్తకు పర్యాయపదంగా మారిందని… అవినీతికి మారు పేరైన ఈ చెడ్డ పేరు పోవాలంటే పారదర్శక విధానాలు పాటించాల్సిన అవసరం ఉందని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.

పౌర సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, స్థానిక పురపాలక సంస్థలపైనే ఉందన్న సీఎం కేసీఆర్‌.. వార్డుల వారీగా ప్రణాళిక రూపొందించుకొని స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు, కౌన్సెలర్లు, అదనపు కలెక్టర్లు, కలెక్టర్లు, ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.ఒక్క GHMC కి రూ.311 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. కష్టపడి పనిచేస్తే ఆరు నెలల్లో మున్సిపాలిటీలను మార్చుకోవచ్చని స్పష్టం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు చాలా సులభం అయిపోయాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు రాజకీయాలంటే కష్టంతో, త్యాగంతో కూడుకున్న విధి అని తెలిపారు. ప్రజానాయకులుగా ఎదిగితే అది జీవితానికి సాఫల్యం అని అన్నారు. ఐదు కోట్ల మందిలో 140 మందికే మేయర్లు, చైర్ పర్సన్లు అయ్యే అవకాశం వచ్చిందని, దీన్ని ఒక సోపానంగా భావించి సానుకూలంగా భావించగలిగితే ప్రజాజీవితంలో ఎంత ముందుకైనా పోవచ్చని, అది మీ చేతుల్లోనే ఉందని తెలిపారు సీఎం కేసీఆర్.