
తాను రాష్ట్రపతిగా ఎన్నికైతే పౌరసత్వ చట్టం(సీసీఏ)ను అమలు కాకుండా చూస్తానని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. అసోంలో ప్రతిపక్ష శాసనసభ్యులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీసీఏను కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేకపోతోందని, ముసాయిదాను తెలివితక్కువ తనంతో రూపొందించడమే ఇందుకు కారణామని ఆయన అన్నారు. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం కోవిడ్ ను కారణంగా చెప్పి సీసీఏను అమలు చేయలేదని, ఇప్పుడు కూడా దాన్ని అమలు చేయలేకపోతోందని విమర్శించారు. అసోంలో పౌరసత్వం అనేది కీలక విషయమన్న యశ్వంత్.. రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది బయటి శక్తి వల్ల కాదని, అధికారంలో ఉన్నవారి వల్లేనని ఆరోపించారు. రాజ్యంగాన్ని కాపాడుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. తాను రాష్ట్రపతి భవన్‌లో ఉంటే సీసీఏను అమలు కాకుండా చూసుకుంటానని చెప్పుకొచ్చారు. జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక కోసం సారూప్యత కలిగిన పార్టీల మద్దతు కోరేందుకు యశ్వంత్ సిన్హా అస్సాంలో ఒక రోజు పర్యటించారు. కాగా ఈ ఎన్నికల్లో ఎన్డీయే బలపరిచిన ద్రౌపది ముర్ముతో యశ్వంత్ సిన్హా బరిలోకి దిగుతున్నారు. జున్ 21న ఫలితాలు రానుండగా, రాష్ట్రపతిగా ఎన్నికైన వారు జులై 25న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.