ముస్లింలతో పాటు ఎవరికీ సిటిజన్ షిప్ పోనేపోదు

ముస్లింలతో పాటు ఎవరికీ సిటిజన్ షిప్ పోనేపోదు

మీకు(ప్రతిపక్షాలకు) మోడీ నచ్చకపోవచ్చు. నా మీద కోపం ఉంటే నామీదనే చూపెట్టండి. నన్ను ఎంత తిట్టాలనుకుంటే అంత తిట్టండి. నా దిష్టిబొమ్మలను తగలబెట్టాలనుకుంటే తగలబెట్టండి. కానీ.. దేశ సంపదను తగలబెడితే ఊరుకోం. అహింసా దేశంలో హింసను సహించేది లేదు.

బెంగాల్​ దీదీ..  సీదా కోల్​కతా నుంచి ఐక్యరాజ్యసమితికి పోతారంట. సీఏఏపై అక్కడ తేల్చాలంటున్నరు. మరి ఈ దీదీనే కొన్నేళ్ల కింద పార్లమెంట్​లో నిలబడి ఏం మాట్లాడారు? బంగ్లాదేశ్​ నుంచి వస్తున్న శరణార్థులకు రక్షణ కల్పించాలని ఆమె లోక్​సభ స్పీకర్​ మీద పేపర్లు విసరింది నిజం కాదా?.

న్యూఢిల్లీ:

సిటిజన్​షిప్​ అమెండ్​మెంట్​ యాక్ట్​ (సీఏఏ) వల్ల దేశంలోని ఏ ఒక్క ముస్లింకు సిటిజన్​షిప్​ పోనే పోదని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. ఇది కేవలం శరణార్థులకు సంబంధించిందేనన్నారు.  కావాలనే ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని, ముస్లింలను భయాందోళనలకు గురిచేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. సీఏఏను వ్యతిరేకిస్తున్నవారు ఒక్కసారి పూర్తిగా దాన్ని చదివి మాట్లాడాలని హితవుపలికారు. తనపై  కోపం ఉంటే తనను కసితీరా తిట్టొచ్చని, కసితీరా తన దిష్టిబొమ్మలు తగలబెట్టొచ్చని, కానీ దేశ సంపదను తగలబెడుతామంటే సహించబోమని హెచ్చరించారు.

ఎన్నార్సీపై భయం అక్కర్లేదు

సీఏఏ పేరిట ముస్లింలను నిర్బంధిస్తారంటూ, ముస్లింలకు డిటెన్షన్​ సెంటర్లు పెడుతారంటూ కాంగ్రెస్​ నేతలు, ఆ పార్టీ దోస్తులు, అర్బన్​నక్సల్స్​ తప్పుడు ప్రచారం చేస్తున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలకు ఆ చట్టం ఎక్కడ వ్యతిరేకమో నిరూపించాలని సవాల్​ విసిరారు. ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఏర్పాటు చేసిన ఢిల్లీ కాలనీల వాసుల అభినందన సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లను, హింసను తీవ్రంగా ఖండించారు.  ప్రధాని ఏమన్నారంటే..

కోపం ఉంటే నామీద చూపండి

సబ్​కా సాత్​.. సబ్​కా వికాస్​.. సబ్​కా విశ్వాస్​ నినాదాంతో సీఏఏను రూపొందించాం. దీని వల్ల ఎవరి హక్కులకు భంగం వాటిల్లదు. మేమెప్పుడూ కులం, మతం, జాతి అని ఆలోచించలేదు. అలా ఆలోచించం కూడా. దేశమంతా ఒక్కటన్నదే మా నినాదం. ఏ పథకం ప్రవేశపెట్టినా ఇదే నినాదంతో ముందుకు వెళ్తాం.  విభజించడం.. చిచ్చుపెట్టడం..లాంటి ఆలోచనలు ఉన్నవాళ్లే ఇప్పుడు ప్రజలను రెచ్చగొడుతున్నారు. కాంగ్రెస్​, వాళ్ల దోస్తుల ప్రజలకు అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారు. సీఏఏపై అబద్ధాలు చెప్పి ముస్లింలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అరాచకాలు సృష్టిస్తున్నారు. స్కూల్​ బస్సులను, స్కూల్ ఆటోలను,  యాత్రికుల బస్సులను, రైళ్లను, మోటార్​సైకిళ్లను, చిన్న చిన్న దుకాణాలను, ఇండ్లను తగలబెడుతున్నారు. ఇదంతా మన సంపద కాదా? ఎందుకు తగలబెడుతున్నారు? ఇదా రాజకీయం?!  మీకు(ప్రతిపక్షాలకు) మోడీ నచ్చకపోవచ్చు. నచ్చకపోతే వ్యతిరేకించండి. నా మీద కోపం ఉంటే నామీదనే చూపించండి. నా మీద ఎంత శత్రుత్వం పెంచుకోవాలనుకుంటున్నారో అంత పెంచుకోండి. నన్ను ఎంత తిట్టాలనుకుంటున్నారో అంత తిట్టండి. నా దిష్టిబొమ్మలను తగలబెట్టాలనుకుంటే తగలబెట్టండి. కానీ.. దేశ సంపదను తగలబెట్టకండి. పేదల ఆటోరిక్షాలను తగలబెట్టకండి. పేదల ఆస్తులను తగలబెట్టకండి.  నా మీద కోపంతో పేదలను ఇబ్బంది పెడితే మీకు ఏమొస్తది?

పోలీసులను రాళ్లతో కొడతారా?

సీఏఏ వ్యతిరేక ఆందోళనల పేరిట పోలీసులను టార్గెట్​ చేస్తున్నారు. వాళ్లపై రాళ్లు విసురుతున్నారు. మాకన్నా ముందు మీ ప్రభుత్వమే ఉంది కదా. అప్పుడు కూడా పోలీసులు ఉన్నారు కదా? ప్రభుత్వాలు మారినా వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తూనే ఉంటారు. వాళ్లు ఎవరికీ శత్రువులు కాదు. ప్రజలను, దేశాన్ని రక్షించడానికే వాళ్లు నిరంతరం తపిస్తారు. మన కోసం వేల మంది పోలీసులు ప్రాణాలను త్యాగం చేశారన్న విషయం మరిచిపోతే ఎట్ల? వాళ్ల డ్యూటీ వాళ్లను చేసుకోనివ్వరా? పోలీసులను టార్గెట్​ చేయడం ఏంది?

పాక్​లోని అందరికీ ఇక్కడ పౌరసత్వం ఎట్లిస్తరు?

మీరు(కాంగ్రెస్​ నేతలు) కూడా హామీలు ఇచ్చారు.. కానీ అమలు చేయలేదు. మేము మాటను నిలబెట్టుకున్నాం. పాకిస్తాన్​లోని అందరికి మన దేశంలో పౌరసత్వం ఇవ్వాలన్నది వాళ్ల వాదన. ఇది ఎట్ల సాధ్యమో చెప్పాలి? ఇట్ల ఏ దేశంలోనైనా చేస్తారా? ఒక దేశంలోని అందరికీ మరో దేశంలో పౌరసత్వం ఇవ్వడం సాధ్యమా?

అప్పట్లో మన్మోహన్​ చెప్పిందేంది?

ఈ దేశానికి పదేండ్లు ప్రధానిగా ఉన్న మన్మోహన్.. అప్పట్లో పార్లమెంట్​లో నిలబడి ఏం చెప్పారు? దానికి సంబంధించి వీడియో క్లిప్పింగ్స్​ కూడా ఉన్నాయి. ‘బంగ్లాదేశ్​ శరణార్థులకు పౌరసత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారి బాధలను అర్థం చేసుకోవాల్సి అవసరం ఉంది. వాళ్లకు జీవితాలు ప్రసాదించాలి’ అని మన్మోహన్​ చెప్పలేదా? దాన్నే మేం అమలు చేస్తుంటే  ఎట్లా శత్రువులమవుతాం?  అస్సాం మాజీ సీఎం గొగోయ్,  రాజస్థాన్​ సీఎం అశోక్​ గెహ్లాట్​ ఏం చెప్పారో మరిచిపోయారా?

దీదీ.. మీకేమైంది?

సీఏఏపై బెంగాల్​ సీఎం మమతా దీదీ..  సీదా కోల్​కతా నుంచి ఐక్యరాజ్యసమితికి వెళ్తానంటున్నారు. కొన్నేళ్ల క్రితం ఈ దీదీనే పార్లమెంట్​లో నిలబడి దేని కోసం లొల్లిపెట్టారు?  బంగ్లాదేశ్​ నుంచి వస్తున్న అక్రమ వలసలను ఆపాలని, శరణార్థులను ఆదుకోవాలని ఆమె అప్పట్లో లోక్​సభ స్పీకర్​ మీద పేపర్లు విసిరింది నిజం కాదా?  మమతా దీదీ.. ఇప్పుడు మీకేమైంది? ఎందుకు మారిపోయారు? ఎన్నికల కోసమే ఇలా మారిపోయారా? మొన్నామధ్య రెగ్యులర్​ డ్రిల్​లో భాగంగా కోల్​కతాకు ఆర్మీ వస్తే.. అది మోడీ సేనా అంటూ దీదీ గగ్గోలు పెట్టారు. ఆమెకు ఇంత భయమెందుకు?  కమ్యూనిస్టు నేత ప్రకాశ్​ కారత్​ కూడా బంగ్లాదేశ్​నుంచి వచ్చే శరణార్థులకు మద్దతివ్వాలని కోరలేదా? ఇప్పుడు అబద్ధాలతో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజలను మభ్యపెడుతున్నారు. 370 ఆర్టికల్​కు మద్దతిచ్చినవాళ్లే ఇప్పుడు సిటిజన్​షిప్​ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు.

ఆ సీఎంలు కనీసం చట్టం గురించి చదవాలి

సీఏఏను తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని కొందరు ముఖ్యమంత్రులు  అంటున్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన మీరు.. మూడురంగుల జెండా సాక్షిగా ప్రమాణం చేసిన మీరు.. కనీసం మన రాజ్యంగంలోని చట్టం గురించైనా  పూర్తిగా చదవండి. కుదరకపోతే మీ అడ్వకేట్​ జనరల్స్​తోనైనా  పూర్తిగా చెప్పించుకోండి. ఆపై మీ నిర్ణయం ప్రజలకు చెప్పండి. దేశ రక్షణ కోసం, ఏది చేయాలో అది చేయడానికి వెనకడుగు వేయబోను. ప్రతిపక్షాలు నన్నెంతగా ద్వేషిస్తే.. ప్రజలు నన్నంతగా ప్రేమిస్తారు.   తమ టేప్​ రికార్డు వినిపించడం కాదు..  మా ట్రాక్​ రికార్డును చూడాలి. స్నేహం కోసం మేం ప్రయత్నిస్తే పాక్​ వెన్నుపోటు పొడిచింది. కానీ మిగతా ఇస్లాం దేశాలన్నీ మన దేశంతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాయి. ఈ సంబంధాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక  అల్లర్లు సృష్టిస్తున్నాయి.