అంగన్‌వాడీలను తప్పుదోవ పట్టిస్తున్నరు : రాంబాబు యాదవ్

అంగన్‌వాడీలను తప్పుదోవ పట్టిస్తున్నరు : రాంబాబు యాదవ్

యాదగిరిగుట్ట, వెలుగు: సీఐటీయూ, ఏఐటీయూసీ నేతలు స్వార్థ రాజకీయాల కోసం అంగన్‌వాడీలను తప్పుదోవ పట్టిస్తున్నారని   బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ విమర్శించారు. యాదగిరిగుట్టలోని మున్నూరుకాపు సత్రంలో ఆదివారం బీఆర్టీయూ రాష్ట్ర కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. సీఐటీయూ, ఏఐటీయూసీ  నేతలు అంగన్‌వాడీలను పావులుగా వాడుకుంటూ.. సాధ్యం కాని డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నారని మండిపడ్డారు.

సీపీఎం అధికారంలో ఉన్న కేరళలో అంగన్వాడీల కంటే తెలంగాణలో జీతాలు ఎక్కువని స్పష్టం చేశారు. అక్కడ చేయని సమ్మె ఇక్కడ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.  అంగన్వాడీల రెగ్యులరైజేషన్ అనేది అసాధ్యమని ఇకనైనా వారి కుట్రను పసిగట్టి సమ్మె విరమించాలని కోరారు.  సాధ్యమయ్యే డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా యాదగిరిగుట్టకు చెందిన వేముల మారయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  

అనంతరం  బీఆర్టీయూ నాయకులు యాదగిరిగుట్టలో ర్యాలీ నిర్వహించారు.  బీఆర్టీయూ రాష్ట్ర నాయకులు చింతపండు అనురాధ, మాధవి, సాయి రెడ్డి, యాదాద్రి జిల్లా బీఆర్టీయూ అధ్యక్షుడు మాధవరెడ్డి, యాదగిరిగుట్ట మండల నాయకుడు దేవేందర్ ఉన్నారు.