V6 News

కార్మికులకు సామాజిక భద్రత చట్టం రావాలి..సీఐటీయూ రాష్ట్ర సభలో తీర్మానం

కార్మికులకు సామాజిక భద్రత చట్టం రావాలి..సీఐటీయూ రాష్ట్ర సభలో తీర్మానం

మెదక్, వెలుగు: కార్మికులకు సామాజిక భద్రత చట్టం తీసుకురావాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమ, కోశాధికారి రాములు డిమాండ్​ చేశారు. మెదక్ లో జరుగుతున్న సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభల్లో భాగంగా మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులు కోటి మంది ఉన్నారని వారికి సామాజిక భద్రత చట్టం తీసుకురావాలని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. 

30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉండగా సెస్​ ద్వారా సమకూరిన రూ.6 వేల  కోట్లను కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఇతర శాఖలకు మళ్లించిందని ఆరోపించారు. సీఎస్​సీకి రూ.500 కోట్లు, ఇన్సురెన్స్​ సంస్థలకు రూ.346 కోట్లు ఇచ్చి భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. 

7 లక్షల మంది ఉన్న హమాలీ కార్మికులకు రక్షణ, ప్రమాద, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని, 25 లక్షల మంది ఉన్న ట్రాన్స్​ పోర్టు కార్మికులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.  కార్మికులకు ఉరితాళ్లుగా మారిన నాలుగు లేబర్​ కోడ్​ లను రాష్ట్రంలో అమలు చేయమని ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు.  సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం పాల్గొన్నారు.