
- కూర్చోలేం.. నిల్చోలేం
- చెత్త, మురుగుతో నిండిపోతున్న సిటీ బస్షెల్టర్లు
- దోమలకు ఆవాసాలుగా మారుతున్న పరిస్థితి
- దూరంగా రోడ్లపై నిలబడుతున్న ప్రయాణికులు
- బస్ చార్జీలు పెంచిన అధికారులు క్లీనింగ్ చేయించట్లేదని జనం అసహనం
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ పరిధిలోని బస్షెల్టర్లు అధ్వానంగా తయారయ్యాయి. చెత్త చెదారంతో నిండిపోతున్నాయి. కొన్నిచోట్ల షెల్టర్ల ముందుగా మురుగు ప్రవహిస్తోంది. ఫలితంగా ప్రయాణికులు బస్సుల కోసం దూరంగా రోడ్లపై నిలబడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సీజనల్వ్యాధులు పెరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. గ్రేటర్ పరిధిలో మొత్తం1,050 రూట్లలో 2,350 బస్టాపులు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం.. 1,250 బస్టాపుల్లో మాత్రమే షెల్టర్లు ఉన్నాయి. గ్రేటర్‌వ్యాప్తంగా డైలీ12 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేస్తున్నారు. ప్రతిఒక్క చోట బస్సు కోసం కనీసం10 నిమిషాల నుంచి అరగంట వరకు వేచి ఉండాల్సి వస్తోంది. కానీ ఉన్న బస్షెల్టర్ల క్లీనింగ్‌ను అధికారులు పట్టించుకోవడం లేదు. డస్ట్బిన్లలోని చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడం లేదు. చెత్త, దుమ్ము, మురుగుతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు బస్సుల కోసం వేచి ఉన్నవారిపై దాడి చేస్తున్నాయి. వర్షం కురిసిన టైంలో పరిస్థితి మరి దారుణంగా ఉంటోందని, బస్షెల్టర్లు ఉపయోగపడడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సు వచ్చేంత వరకు నరకం కనిపిస్తోందని అంటున్నారు.
కేవలం ఆదాయం కోసమేనా?
బస్ షెల్టర్లపై అడ్వటైజ్ మెంట్ల ద్వారా జీహెచ్ఎంసీకి ఏటా దాదాపు రూ.25 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. పైసలపై ఫోకస్పెడుతున్న అధికారులు బస్ షెల్టర్ల మెయింటెనెన్స్, కొత్తగా అవసరమైన ప్రాంతాల్లో ఏర్పాటును పట్టించుకోవడం లేదు. ఎప్పటికప్పుడు బస్ షెల్టర్లపై ప్రకటనలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నప్పటికీ క్లీన్ గా ఉన్నాయా?లేదా? అనేది చూడటం లేదు. ఆదాయం వస్తే చాలు కదా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అలాగే కొన్ని బస్షెల్టర్ల అద్దాలపై అడ్డదిడ్డంగా స్టిక్కర్లు, పోస్టర్లు అంటిస్తుండడంతో బస్సులు వచ్చినా కనిపించడం లేదు. చుట్టుపక్కల చిరువ్యాపారులు షెల్టర్లలో తమ వస్తువులు పెట్టుకుంటున్నారు. బైకులు పార్క్చేస్తున్నారు. ఫలితంగా వృద్ధులు, మహిళలు రోడ్ల మీద నిల్చొని ఇబ్బందులు పడుతున్నారు.
వ్యాధులకు స్పాట్లు..
బస్టాపులు వ్యాధులకు అడ్డాగా మారుతున్నాయని జనం మండిపడుతున్నారు. కొన్ని షెల్టర్లు టాయిలెట్ల పక్కన, మరికొన్ని నాలాలు, డ్రైనేజీల పక్కన ఉన్నాయి. వీటి కారణంగా మురుగునీరు బస్టాపుల ఆవరణలో ప్రవహిస్తోంది. బస్ షెల్టర్లలో పూర్తిగా చెత్త ఉంటుండటంతో ప్రయాణికులు అసలు లోపలికే వెళ్లడం లేదు. కంపు తట్టుకోలేక ఎంతసేపైనా షెల్టర్లకు దూరంగా రోడ్లపైనే నిలబడుతున్నారు. సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని, మరో నెలపాటు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులకు మాత్రం ఇవేం పట్టడం లేదు. బస్షెల్టర్లను క్లీన్ చేయించడం లేదు.
కంపు భరించలేక దూరంగా నిలబడుతున్నా
బస్టాపులు ఉన్నది జనం కోసమేనా? నేను రోజూ ఐదారు బస్సుల్లో ప్రయాణిస్తా. ఎక్కడ చూసినా బస్టాపులు క్లీన్‌గా ఉండటంలేదు. కొన్నింటి దగ్గర ఉన్న డస్ట్బిన్లలో వేస్తున్న చెత్తను అస్సలు తీసుకెళ్లడంలేదు. రోజుల తరబడి అలాగే ఉంటోంది. దుర్వాసన భరించలేక దూరంగా నిలబడాల్సి వస్తోంది.
- రాఘవేందర్, ప్రయాణికుడు,
అప్జల్ గంజ్
అధికారులు పట్టించుకోవాలి
బస్టాపులో లోపల కూర్చుందామంటే చెత్త పేరుకుపోయి ఉంటుంది. బయట నిలబడే వీలు లేదు. బస్టాపును ఆనుకొని రోజూమురుగు పారుతోంది. బస్టాపులు ఉన్నా కూర్చోలేకపోతున్నాం. నిలబడలే కపోతున్నాం. చాలా ఇబ్బందిగా ఉం టోంది. బస్సు వచ్చిందాకా రోడ్ల మీదే నిల్చుంటున్నాం. బస్‌చార్జీలు పెంచిన అధికారులు బస్టాపులు ఎలా ఉన్నాయో పట్టించుకోవడంలేదు. స్పందించి చర్యలు తీసుకోవాలి.
- సంతోషి, దిల్ సుఖ్ నగర్