సిటీ బస్సులు ఆలస్యంతో ఆటోల బాట పడుతున్న జనం

సిటీ బస్సులు ఆలస్యంతో ఆటోల బాట పడుతున్న జనం

హైదరాబాద్, వెలుగు: సిటీ బస్సులు ఆలస్యం అవుతుండటంతో జనాలు షేర్ ఆటోల బాట పడుతున్నారు. సిటీలో ఆఫీసులు, కాలేజీలకు వెళ్లేవారితో పాటు చాలామంది ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్తుంటారు. ఒకప్పుడు ప్రతి పది, పదిహేను నిమిషాలకు బస్టాపుల్లో బస్సు ఆగేది. కరోనా తర్వాత బస్సుల సంఖ్య తగ్గడంతో సరైన టైమ్​కు రావడం లేదు. దీంతో ప్యాసింజర్లు గంటల పాటు బస్టాపుల్లో వెయిట్ చేయాల్సి వస్తోంది. మరోవైపు సిటీ బస్సుల టికెట్లు కూడా పెరిగాయి. బస్సు టికెట్ రేట్లు, షేర్ ఆటోల చార్జిలు ఒకే విధంగా ఉంటున్నాయి. దీంతో బస్సుల కోసం ఎదురుచూడలేక చాలామంది షేర్ ఆటోలను ఆశ్రయిస్తున్నారు. 

రెండు లక్షల ఆటోలు..

సిటీలో సుమారు రెండు లక్షల ఆటోలు నడుస్తున్నాయి. ప్రతి నాలుగైదు కి.మీలకు ఆటో అడ్డాలు కనిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్ రోడ్ నం.12లోని విరించి హాస్పిటల్, అమీర్ పేట నుంచి ఎర్రగడ్డ, కూకట్ పల్లి నుంచి ఎర్రగడ్డ, పంజాగుట్ట నుంచి సోమాజిగూడ, పార్శిగుట్ట నుంచి సికింద్రాబాద్, వారాసిగూడ నుంచి సికింద్రాబాద్, చెక్​పోస్టు నుంచి పెద్దమ్మ తల్లి టెంపుల్, అక్కడి నుంచి మాదాపూర్ ఇలా ఒక్కో రూట్ నుంచి మరో రూట్​కు స్టాండెడ్ గా వెళ్లే షేర్ ఆటోలుంటాయి. కొన్ని ఏరియాల్లో ఆటో స్టాండ్లు.. బస్టాప్ ల పక్కనే ఉంటున్నాయి. ఒకప్పుడు షేర్ ఆటోలకు ఫుల్ గిరాకీ ఉండేది. కరోనా దెబ్బకు చాలామంది సొంత వెహికల్స్​నే వాడటంతో షేర్ ఆటోలకు గిరాకీ తగ్గింది. ఇప్పుడిప్పుడే షేర్ ఆటోల్లో జర్నీ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బస్సులు ఆలస్యంగా రావడం, చార్జీలు ఒకేలా ఉండటం షేర్ ఆటోలకు కలిసొస్తోంది. ఒక్కో ఆటో అడ్డాలో సుమారు 20 నుంచి 100 వరకు ఆటోలుంటున్నాయి. ఇవన్నీ లైన్ కౌంట్‌‌లో నడుస్తుంటాయి. బస్సులు రాకపోతే జనాలు చూసి చూసి ఆటోలెక్కుతున్నారని డ్రైవర్లు చెప్తున్నారు. మునుపటితో పోలిస్తే ఆటో చార్జీలు పెంచినా బస్‌‌ టికెట్లతో పోల్చుకుని ఇందులోనే ప్రయాణం చేస్తున్నారంటున్నారు.

తగ్గిన బస్సులు..

ఉదయం, సాయంత్రం బస్టాప్‌‌లు ప్యాసింజర్లతో కిటకిటలాడుతుంటాయి. లాక్​డౌన్​కు ముందు సిటీ బస్సులు రెగ్యులర్​గా తిరిగిన అనేక రూట్లలో ఇప్పుడు చాలావరకు బస్సులను రద్దు చేశారు. గ్రేటర్ పరిధిలో 29 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి.  2019 ఆర్టీసీ సమ్మెకు ముందు సిటీ వ్యాప్తంగా 3,700 బస్సులు నడిచేవి. తర్వాత లాభాలు రావడం లేదని, స్క్రాప్ బస్సులు ఉన్నాయని వెయ్యి సర్వీసులను తగ్గించారు. కరోనా టైమ్​లో బస్సులు నడవక తీవ్ర నష్టాలు ఎదురవడంతో  లాభాలు రాని రూట్లలో   ఒక్కో డిపో నుంచి15 నుంచి 30 బస్సులను తగ్గించారు. మెహిదీపట్నం డిపోలోనే 40 ప్రైవేట్ బస్సులు నడుస్తుండగా ఇందులో 11 బస్సులను రద్దు చేశారు. ఇలా అన్ని డిపోల్లో 10కిపైగా బస్సులు రద్దు చేశారు. ప్రస్తుతం 1,300 బస్సులను నడుపుతుండటం, అందులోనూ చాలావరకు ఇన్ టైమ్​లో బస్టాప్ లకు రాకపోవడంతో జనాలు ఇతర ట్రాన్స్ పోర్టు మార్గాలను వెతుకుతున్నారు. అందులో భాగంగా షేర్ ఆటోలను ఆశ్రయిస్తున్నారు.     

  •     వారాసిగూడ నుంచి సికింద్రాబాద్​కు షేర్ ఆటోలో ఒకరికి రూ.15 తీసుకుంటున్నారు.  సిటీ బస్‌‌ టికెట్ రేట్ కూడా అంతే ఉంది.
  •     అమీర్ పేట్ నుంచి ఎర్రగడ్డకు వెళ్లే రూట్ ఆటోల్లో ఒకరికి రూ. 30 తీసుకుంటున్నారు. పెరిగిన బస్సు చార్జీల  కారణంగా అందులోనూ టికెట్ రేటు రూ.30 ఉంది,
  •     విరించి హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌‌పోస్టుకు బస్‌‌ టికెట్ రూ.30 ఉండగా, షేర్ ఆటోలోనూ అంతే తీసుకుంటున్నారు.

ఇలా బస్‌‌ టికెట్‌‌, షేర్ ఆటోల్లో ఒకే విధంగా చార్జీ ఉండటంతో  అందుబాటులో ఉన్న వాటిలో వెళ్లేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. చాలా ఏరియాల్లో ఆర్టీసీ బస్సులు లేటుగా వస్తుండటంతో పదులసంఖ్యలో ఉన్న రూట్‌‌  ఆటోల బాట పడుతున్నారు. ముఖ్యంగా ప్రతి రోజు ఒకే రూట్‌‌లో ప్రయాణం చేసేవారు తొందరగా వెళ్లేందుకు షేర్​ఆటోలను ఆశ్రయిస్తున్నట్లు  చెప్తున్నారు. 

బస్సుల సంఖ్య పెంచాలి

ప్రస్తుతం బస్సులకు, షేర్ ఆటోలకు చార్జీలో తేడా లేదు. సిటీ బస్సుల కోసం చూసి అవి లేట్​ అయితే ఆటోల్లో వెళ్తున్నాం. జనాలు ఎక్కువగా ట్రావెల్ చేసే రూట్లలో బస్సుల సంఖ్య పెంచితే బాగుంటుంది.  లేకపోతే బస్సు పాస్​లు ఉన్న వారికి ఇబ్బంది అవుతుంది. – అశోక్, అమీర్ పేట

బస్సు కోసం 20 నిమిషాలు వెయిట్ చేయాల్సిందే

రోజు పని మీద షేక్ పేట నుంచి మెహదీపట్నం వెళ్తుంటా. బస్సుల కోసం దాదాపు 20 నిమిషాలు ఎదురుచూడాల్సి వస్తోంది. అందుకే ఆటోలు కనిపించిన వెంటనే ఎక్కేస్తున్నాం. తొందరగా వెళ్లడం కోసమే ఆటోలను ఆశ్రయిస్తున్నం. – మమత, షేక్ పేట

రోజుకు 10 ట్రిప్పులు..

నేను పార్శిగుట్ట నుంచి సికింద్రాబాద్​కు ఆటో నడుపుతుంటా. మా స్టాండ్‌‌లో వందవరకు ఆటోలుంటాయి. ఉదయం, సాయంత్రం రద్దీ బాగా ఉంటుంది. రోజుకి 8 నుంచి 10 ట్రిప్‌‌లు ఉంటాయి. ఇది వరకు రూ.10 చార్జ్ ఉంటే ప్రస్తుతం రూ.15కు పెరిగింది. బస్‌‌ టికెట్ కూడా అంతే రేట్ కావడంతో అవి రాకపోవడంతో ఆటోలు ఎక్కుతున్నారు. రెండు, రెండున్నర 
కి.మీ ఉంటే రూ.15 ఛార్జి చేస్తున్నాం. వారాసిగూడ నుంచి సికింద్రాబాద్​కు కూడా రూ.15 ఆటో చార్జి ఉంది.  – మాధురి, ఆటోడ్రైవర్, పార్శిగుట్ట