‘శేఖర్’ సినిమాకు తొలగిన ఇబ్బందులు

‘శేఖర్’  సినిమాకు తొలగిన ఇబ్బందులు

హైదరాబాద్: రాజశేఖర్ హీరోగా నటించిన శేఖర్ మూవీ ప్రదర్శనకు అనుమతినిస్తూ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రెండు రోజులుగా నిలిచిపోయిన శేఖర్ మూవీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. జీవిత తన వద్ద తీసుకున్న అప్పు చెల్లించనందున శేఖర్ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ ఫైనాన్షియర్ పరంధామ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీంతో శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేస్తూ కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అయితే సినిమా ఆగిపోవడంతో తమకు ఆర్ధికంగా తీవ్ర నష్టం కలుగుతోందని, నిలిపివేతపై ఉన్న స్టే ఆర్డర్ ను ఎత్తివేయాలని జీవిత తరపున న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఈ కేసు విషయంలో ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు సినిమా ప్రదర్శనకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక సినిమా ప్రదర్శనకు తమకు కూడా ఏ అభ్యంతరం లేదని పరంధామ రెడ్డి తరపు లాయర్ కోర్టుకు తెలిపారు.

అయితే సినిమాకు వచ్చే కలెక్షన్ల నుంచి తమ క్లయింట్ కు రావాల్సిన రూ.87.10 లక్షలను కోర్టులో డిపాజిట్ చేయాలని కోరారు. ఈ కండిషన్ కు జీవిత తరపు లాయర్స్ అంగీకరించారు. స్పెషల్ అకౌండ్ ఓపెన్ చేసి.. రెండు రోజుల్లో ఖాతా వివరాలు కోర్టుకు తెలియజేస్తామన్నారు. దీంతో సినిమా ప్రదర్శనకు అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ నెల 20న శేఖర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే కోర్టు ఆదేశాలతో 23 నుంచి ప్రదర్శనలు నిలిపివేశారు. ఇక కోర్టు తాజా ఉత్తర్వులతో శేఖర్ మూవీ మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది.

మరిన్ని వార్తల కోసం...

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్ ఎవరు?..

అకీరా గ్రాడ్యుయేషన్ కు కలిసి వచ్చిన పవన్..