ఉద్యోగాల పేరుతో సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం

ఉద్యోగాల పేరుతో సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం
  •    ఉద్యోగాల పేరుతో మోసం
  •     ఢిల్లీ, యూపీ కేంద్రంగా సైబర్ నేరగాళ్ల ఫేక్ కాల్ సెంటర్లు
  •     ఆన్‌‌లైన్‌‌లో సెలక్షన్, అపాయింట్‌‌మెంట్‌‌ లెటర్స్‌‌‌‌
  •     సెక్యూరిటీ డిపాజిట్‌‌, చార్జీల పేరుతో రూ. లక్షలు వసూలు
  •     నలుగురిని అరెస్ట్‌‌ చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు

హైదరాబాద్‌‌, వెలుగు: ఢిల్లీ, యూపీ కేంద్రంగా ఫేక్ కాల్ సెంటర్లను రన్ చేస్తూ ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్న నలుగురిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఈ కేసు వివరాలను జాయింట్ సీపీ గజరావ్ భూపాల్, సైబర్​ క్రైమ్ ఏసీపీ ప్రసాద్  వెల్లడించారు. నల్లకుంటకు చెందిన ఓ వ్యక్తి  ప్రైవేట్‌‌ జాబ్ చేస్తున్నాడు. నౌకరీ డాట్ కమ్‌‌లో తన ప్రొఫైల్‌‌ అప్‌‌లోడ్‌‌ చేశాడు. మంచి ఆఫర్స్‌‌ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది  ఫిబ్రవరి 12న  [email protected] నుంచి సైబర్ నేరగాళ్లు అతడికి ఓ మెయిల్ పంపారు. షెల్ పీఎల్‌‌సీ ఇండియాలో సీనియర్ జనరల్ మేనేజర్ పోస్టుకు అతడిని రిక్రూట్ చేసినట్లు ఆ మెయిల్ లో ఉంది. ఏడాదికి  రూ. 69 లక్షల జీతం ఉంటుందని చూపిస్తూ  అపాయింట్‌‌మెంట్‌‌ లెటర్ ను సైతం పంపించారు.  సెక్యూరిటీ డిపాజిట్,మెడికల్ చెకప్, ప్రాసెసింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్, ఇతర చార్జీల కింద అతడి నుంచి మొత్తం రూ. 5 లక్షల 49 వేలు వసూలు చేశారు. జాబ్ లో జాయిన్ అయిన తర్వాత  డబ్బు రీఫండ్‌‌ చేస్తామని నమ్మించారు. జాయినింగ్‌‌ కోసం షెల్ కంపెనీకి వెళ్లిన సదరు వ్యక్తికి  అపాయింట్‌‌మెంట్ లెటర్ ఫేక్ అని తెలిసింది. మోసపోయినట్లు గుర్తించి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు.

 అకౌంటెంట్‌‌ జాబ్ వచ్చిందని చెప్పి.. 

 గాంధీనగర్‌‌‌‌కు చెందిన ఓ మహిళ తన రెజ్యూమ్‌‌ను షైన్ డాట్ కామ్‌‌లో అప్‌‌లోడ్ చేసింది. ఆ తర్వాత ఆమెకు యాక్సెంచర్ కంపెనీలో అకౌంటెంట్ ఉద్యోగం ఇస్తామని సైబర్ నేరగాళ్లు కాల్స్‌‌ చేశారు. దీన్ని నమ్మిన బాధితురాలి నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు, జాబ్ కన్ఫర్మేషన్,సెక్యూరిటీ డిపాజిట్,ప్రొఫైల్ ఐడి వెరిఫికేషన్,మెడికల్ చెక్ అప్‌‌ సహా ఇతర చార్జీల పేరుతో మొత్తం రూ. లక్షా 73 వేలు వసూలు చేశారు. మళ్లీ డబ్బులు కావాలని అడగడంతో బాధితురాలికి అనుమానం వచ్చింది. యాక్సెంచర్‌‌‌‌ కంపెనీలో ఎంక్వయిరీ చేసింది. మోసపోయినట్లు గుర్తించి సిటీ సైబర్‌‌‌‌ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది.

ఇలా దొరికారు

పై రెండు కంప్లయింట్లతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు ఫైల్ చేసి బ్యాంక్ అకౌంట్లు, ఫోన్‌‌ నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సైబర్ నేరగాళ్లు ఢిల్లీ, యూపీ నుంచి ఈ ఫ్రాడ్ ను ఆపరేట్‌‌ చేసినట్లు గుర్తించారు. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ నెల 25న ఢిల్లీ రాజౌరి గార్డెన్ లో ఉన్న కాల్‌‌ సెంటర్‌‌‌‌పై దాడులు చేసి నిర్వాహకులు నితీష్‌‌కుమార్‌‌‌‌(28) కరన్‌‌ కొహిలి(27)ని అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా యూపీలోని ఘజియాబాద్‌‌ పరిధి ఇందిరాపురంలోని మరో కాల్‌‌సెంటర్‌‌‌‌పై సైతం దాడులు చేసి నిర్వాహకులు రాహుల్‌‌కుమార్‌‌‌‌(28), ప్రతీక్‌‌ మన్వర్‌‌‌‌ అస్వాల్‌‌(32)ను అరెస్ట్ చేశారు. నిందితులు 6 నెలలుగా ఈ కాల్ సెంటర్స్ నడుపుతూ జాబ్ ల పేరుతో మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి 16 సెల్ ఫోన్లు, 5 కంప్యూటర్ హర్డ్ డిస్క్ లు, 4 ల్యాప్ టాప్ లు, 9 డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఆన్ లైన్ జాబ్ పోర్టల్స్ నుంచి అభ్యర్థుల డేటా కలెక్ట్ చేసి.. దేశవ్యాప్తంగా నిరుద్యోగులను ట్రాప్ చేసి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని జాయింట్‌‌ సీపీ గజరావ్ భూపాల్‌‌ తెలిపారు. ఈ– మెయిల్స్, ఫోన్‌‌ కాల్స్‌‌తో  ట్రాప్ చేస్తున్నారన్నారు. సోమవారం వారిని ఢిల్లీ, యూపీ నుంచి సిటీకి తీసుకొచ్చి రిమాండ్ కు తరలించామన్నారు.  నిందితులను కస్టడీలోకి తీసుకుని పూర్తి వివరాలు రాబడతామని చెప్పారు.