రియల్ ఎస్టేట్లో.. సిటీ టాప్

రియల్ ఎస్టేట్లో.. సిటీ టాప్
  •    మూడు నెలల్లోనే 30 శాతం వృద్ధి నమోదు  
  •    పెండింగ్​ అప్లికేషన్లకు హెచ్ఎండీఏ  గ్రీన్​సిగ్నల్​
  •    లే అవుట్లు, బిల్డింగ్ లకు పెరిగిన దరఖాస్తులు 
  •    అసెంబ్లీ ఎన్నికల తర్వాత పుంజుకున్న రియల్  బిజినెస్
  •   ‘అనరాక్​’ సంస్థ రిపోర్ట్  

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల తర్వాత గ్రేటర్ సిటీలో  రియల్​ఎస్టేట్​బిజినెస్ జోరందుకుంది. అందుకు తగ్గట్టుగా హెచ్ఎండీఏకు కూడా దరఖాస్తులు భారీగా పెరిగాయి. జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల్లోనే రియల్​ఎస్టేట్​లో 38శాతం వృద్ధితో సిటీ టాప్​లో ఉన్నట్టు ‘అనరాక్​’ సంస్థ కూడా ఇటీవల తన రిపోర్ట్ లో పేర్కొంది. ఇప్పటికే పెండింగ్ అప్లికేషన్లకు అధికారులు గ్రీన్​సిగ్నల్​ఇస్తున్నారు. రెరా మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి అక్రమాలు బయటపడడంతో కొంతకాలంగా పర్మిషన్లను అధికారులు నిలిపి వేశారు.

తద్వారా హెచ్ఎండీఏ ఆదాయంపై ప్రభావం చూపుతుండడంతో తిరిగి అనుమతులను కొనసాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో హెచ్ఎండీఏ పరిధిలో కొత్త వెంచర్లు, భవన నిర్మాణాల అనుమతులకు రోజురోజుకూ దరఖాస్తులు పెరుగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. గతంలో జరిగిన పొరపాట్లకు తావివ్వకుండా ఉన్నతాధికారులు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గతేడాదితో  పోలిస్తే ఈఏడాది మూడు నెలల్లోనే అత్యధిక దరఖాస్తులను అధికారులు అనుమతులు మంజూరు చేసినట్టు తెలిపారు. దీంతో వచ్చే రోజుల్లో మరింతగా పర్మిషన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. 

అప్లికేషన్లతో పెరిగిన ఆదాయం

 భవన నిర్మాణాలకు, కొత్త వెంచర్లకు, లే అవుట్ల అనుమతులకు కొద్ది రోజులుగా భారీగా దరఖాస్తులు వస్తుండగా అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న హెచ్ఎండీఏ ఆదాయం కూడా పెరిగిందని అంటున్నారు. ముఖ్యంగా శంషాబాద్, శంకర్​పల్లి జోన్​పరిధిలో రియల్​బిజినెస్ జోరందుకుంది.

మేడ్చల్​, ఘట్​కేసర్​జోన్ల పరిధిలోనూ కొంత పెరుగుదల ఉందని అధికారులు చెబుతున్నారు. జనవరి నుంచి మార్చి వరకు  3  నెలల కాలంలో హెచ్ఎండీఏకు  మొత్తం 1022 దరఖాస్తులు వస్తే.. 540 పర్మిషన్లు మంజూరు చేశారు. రూల్స్ కు అనుగుణంగా లేని వాటిని పెండింగ్​లో పెట్టారు. కొంతకాలంగా హెచ్​ఎండీఏలో నెలకొన్న పరిస్థితుల కారంణగా అనుమతుల్లోనూ జాప్యం అయ్యేది  నిజమేనని అధికారులు తెలిపారు. కొత్త అప్లికేషన్లను ఎప్పటికప్పుడు పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటున్నట్టు అధికారులు పేర్కొన్నారు. 

త్వరలోనే ల్యాండ్ కన్వర్షన్ పర్మిషన్లు!

అసెంబ్లీ ఎన్నికల ముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ల్యాండ్​కన్వర్షన్​(భూ మార్పిడులకు)కు భారీగా అనుమతులు ఇవ్వగా కొన్ని వివాదాస్పదం అయ్యాయి. దీంతో కాంగ్రెస్​సర్కార్ అధికారంలోకి రాగానే బంద్ పెట్టింది. తద్వారా సర్కార్ పై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు హెచ్ఎండీఏ ఆదాయంపైనా, రియల్​ఎస్టేట్​ బిజినెస్ పై కూడా ప్రభావం పడుతోంది.  

పార్లమెంట్​ఎన్నికల తర్వాత పర్మిషన్ ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. గత బీఆర్ఎస్ హయాంలో జీవో.111 పరిధిలో చాలా ప్రాంతాల్లో అక్రమంగా భూ మార్పిడిలు చేశారని.. ఇందుకు రెరా మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణదే ప్రధానపాత్ర అనే ఆరోపణలు ఉన్నాయి. ఇకముందు ఎలాంటి వివాదాలు రాకుండా అనుమతులు ఇవ్వాలని హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే 150 దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నట్టు సమాచారం. కొత్తగా వచ్చే దరఖాస్తులకు కూడా త్వరలోనే పర్మిషన్లు ఇచ్చేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. 

హెచ్ఎండీఏకు భవన నిర్మాణాలు, లే అవుట్లపై వచ్చిన దరఖాస్తులు

స్టేటస్​        జనవరి    ఫిబ్రవరి    మార్చి    మొత్తం
రిసీవ్​డ్​అప్లికేషన్స్​    326    394    302    1,022
మంజూరైనవి    116    220    204    540
రిజెక్ట్​ అయినవి    41    70    6    117
పెండింగ్​లో ఉన్నవి    135    134    67    336