- హైదరాబాద్ అశోక్ నగర్‌లో ఘటన
ముషీరాబాద్, వెలుగు: సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం కోచింగ్ తీసుకుంటున్న ఓ యువకుడు హాస్టల్ రెండో అంతస్తు పైనుంచి కిందపడి మరణించాడు. ఈ ఘటన హైదరాబాద్ అశోక్‌నగర్‌లో గురువారం తెల్లవారుజామున జరిగింది.
భూపాలపల్లి జిల్లా అంబటిపల్లి గ్రామానికి చెందిన బాసనీ ఆనంద్ (26) గత రెండేండ్లుగా అశోక్ నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఆనంద్ గురువారం అర్ధరాత్రి 2 గంటలకు హాస్టల్ రెండో అంతస్తులో ఉన్న తన రూమ్ నుంచి వాష్ రూమ్ కోసం బయటకు వచ్చాడు.
అక్కడి నుంచి కింద పడిపోవడంతో తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయాడు. హాస్టల్ సిబ్బంది వెంటనే ఆనంద్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో యశోదా హాస్పిటల్ (సికింద్రాబాద్)కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆనంద్ మరణించాడని డాక్టర్లు నిర్ధారించారు. ఆనంద్ మరణంపై పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
