75 లక్షల టన్నుల వడ్లు సేకరిస్తం: చౌహాన్‌

75 లక్షల టన్నుల వడ్లు సేకరిస్తం: చౌహాన్‌

హైదరాబాద్‌, వెలుగు :  రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయి. ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభించినట్లు సివిల్‌ సప్లయ్స్‌ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ తెలిపారు. ధాన్యం ముందుగా చేతికి వచ్చే జిల్లాల్లో గత మార్చి 25 నుంచే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం మొదటిసారి ప్రత్యేక అనుమతి ఇచ్చిందని తెలిపారు. మార్చి 30 నాటికి 121 టన్నుల ధాన్యాన్ని  కొనుగోలు చేశామని వివరించారు. నిరుడు కంటే ఈయేడు యాసంగి వడ్లు ఎక్కువే సేకరించేందుకు సన్నాహాలు చేశామని వెల్లడించారు. గత యాసంగిలో 66.84 లక్షల టన్నులు కొనుగోలు చేశామని.. ఈయేడు 75.40 లక్షల టన్నుల వడ్లు సేకరించాలని ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన చెప్పారు. గత యాసంగి సీజన్​లో 7,037 సెంటర్లలో కొనుగోళ్లు చేపట్టామని, ఈసారి 7,149 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ప్రతిపాదించినట్లు వెల్లడించారు.

 సాధారణ రకం వడ్లను క్వింటాలుకు రూ.2,183,  గ్రేడ్  ఏ రకం వడ్లను రూ.2,203 చొప్పున సేకరిస్తున్నామన్నారు. రైతులు తమ ధాన్యాన్ని నిబంధనలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. మద్దతు ధరకే వడ్లు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టామని, రైతులు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకొని.. మధ్యవర్తుల దోపిడీకి గురికాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్టు కమిషనర్​ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో అనధికార కోతలు ఉండకూడదని హెచ్చరించారు. రైస్ మిల్లర్లు, వ్యాపారులు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసినా, నిబంధనలు అతిక్రమించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సమస్యలుంటే రైతులు 1967, 1800 4250 0333 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్‌ చేయవచ్చని కమిషనర్‌ వెల్లడించారు.