కొత్త రేషన్ కార్డులపై మంత్రి గంగుల సమీక్ష

కొత్త రేషన్ కార్డులపై మంత్రి గంగుల సమీక్ష
  • కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించే అజెండా రూపకల్పనకు కసరత్తు

హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల జారీ చేయడంపై పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమీక్షించారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతోపాటు నూతన రేషన్ కార్డుల జారీ, డీలర్ల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. క్షేత్ర స్థాయిలో రేషన్ కార్డుల జారీకి ఎదురవుతున్న ఇబ్బందులు, డీలర్ల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. 
కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కేవలం 15 రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశించిన నేపధ్యంలో అందుకు అవసరమైన చర్యలు సిద్ధం చేసేందుకు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. నూతన కార్డుల జారీ, రేషన్ డీలర్ల కమిషన్ పెంపు, మెరుగైన ప్రజా పంపిణీ వ్యవస్థకోసం మంత్రి గంగుల అధ్యక్షతన సబ్ కమిటీ ఏర్పాటైన విషయం విదితమే. మంత్రులు హరీష్ రావు, తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి మరియు సబిత ఇంద్రారెడ్డిలతో కూడిన ఈ సబ్ కమిటీ 14న సమావేశమై విదివిధానాలపై చర్చించనుంది. సబ్ కమిటీ ముందుంచే ప్రతిపాదనలు సిద్దం చేయడానికి పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం తన కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఇతర ఉన్నతాధికారులతో మంత్రి గంగుల ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

కొత్త కార్డుల జారీతో పాటు ఇందులో ముడిపడి ఉన్న అన్ని అంశాలకు సంబందించి సమగ్ర నివేదికలను సబ్ కమిటీ ముందుంచాలని ఈ సందర్భంగా ఆదికారులను ఆదేశించారు గంగుల. ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలతో తెలంగాణ దూసుకుపోతోందని, ప్రస్తుత కరోనా సంక్లిష్ట సమయంలో అన్నార్థుల ఆకలిని తీర్చడం కోసం కేసీఆర్ సర్కార్ అహర్నిషలు కృషిచేస్తుందన్నారు మంత్రి గంగుల కమలాకర్.