రాజ్యాంగమే సుప్రీం.. న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు సమానం: జస్టిస్ BR గవాయ్

రాజ్యాంగమే సుప్రీం.. న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు సమానం: జస్టిస్ BR గవాయ్

ముంబై: దేశంలో రాజ్యాంగమే సుప్రీం అని.. న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు దాని మూల స్తంభాలు అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. వీటిలో ఏదీ ఎక్కువ, ఏదీ తక్కువ కాదని.. ఈ మూడూ సమానమేనని చెప్పారు. ఈ మూడు వ్యవస్థలూ పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ వ్యవహారాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటోందంటూ దేశవ్యాప్తంగా ఇటీవల చర్చలు మొదలైన నేపథ్యంలో సీజేఐ ఈ మేరకు స్పందించారు. 

ఆదివారం ముంబైలో జరిగిన సమావేశంలో మహారాష్ట్ర, గోవా బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సీజేఐకి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘దేశ బేసిక్ స్ట్రక్చర్ చాలా బలంగా ఉంది. జ్యుడీషియరీ లేదా ఎగ్జిక్యూటివ్ లేదా పార్లమెంట్.. వీటిలో ఏదీ సుప్రీం కాదు. రాజ్యాంగం మాత్రమే అత్యున్నతమైనది. మిగతా మూడు వ్యవస్థలూ రాజ్యాంగానికి లోబడి పని చేయాలి” అని స్పష్టం చేశారు. సీజేఐ జస్టిస్ గవాయ్ తన కెరీర్ లో ఇచ్చిన 50 కీలక తీర్పులతో కూడిన బుక్‎ను ఈ సందర్భంగా రిలీజ్ చేశారు. సమావేశం తర్వాత ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ మెమోరియల్ ‘చైత్య భూమి’ని సందర్శించి, నివాళులు అర్పించారు.  

ప్రొటోకాల్ ఉల్లంఘనపై అసంతృప్తి.. 

చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హోదాలో తాను మొదటిసారిగా ముంబైకి వస్తే.. రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రొటోకాల్ పాటించకపోవడంపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ అసహనం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు విశేష అధికారాలు ఉంటాయని, ఒకవేళ జడ్జిలు గనక ప్రొటోకాల్‎ను ఉల్లంఘించి ఉంటే ఈ ఆర్టికల్ కింద చర్యలు చేపట్టాల్సి ఉండేదన్నారు. కాగా, సీజేఐ కామెంట్ల గురించి తెలుసుకున్న మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ సుజాతా సౌనిక్, డీజీపీ రష్మి శుక్లా, ముంబై పోలీస్ కమిషనర్ దేవెన్ భారతి హుటాహుటిన చైత్య భూమి వద్దకు వెళ్లి.. సీజేఐ పాల్గొన్న కార్యక్రమానికి హాజరయ్యారు.