జడ్జిలు కూడా ప్రజా సేవకులే:సీజేఐ జస్టిస్ చంద్రచూడ్

జడ్జిలు కూడా ప్రజా సేవకులే:సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
  • రాజ్యాంగ విలువలను వాళ్లు కాపాడాలి: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ 

కోల్​కతా: కోర్టులను న్యాయం అందించే దేవాలయాలుగా ప్రజలు పిలుస్తుంటారని, అంతమాత్రాన జడ్జిలు దేవుళ్లు మాత్రం కాబోరని సుప్రీంకోర్టు చీఫ్​జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. జడ్జిలు కూడా ప్రజల సేవకులేనని, వాళ్లు కరుణ, సానుభూతితో న్యాయం అందించాలన్నారు. శనివారం కోల్​కతాలో జరిగిన నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ రీజినల్ కాన్ఫరెన్స్​లో సీజేఐ మాట్లాడారు. భారత్​లో నెలకొన్న భిన్నత్వాన్ని కాపాడటమే రాజ్యాంగ నైతికత అని తెలిపారు. జడ్జిలు రాజ్యాంగంలో పేర్కొన్న విలువలను కాపాడేందుకు కట్టుబడి ఉండాలని సూచించారు. 

న్యాయ వ్యవస్థను టెక్నాలజీతో ఆధునికీకరించాలని సీజేఐ అన్నారు. టెక్నాలజీ సాయంతో సమర్థవంతంగా, వేగంగా న్యాయ సేవలు అందించవచ్చని తెలిపారు. ఉదాహరణకు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాఫ్ట్ వేర్ సాయంతో సుప్రీంకోర్టు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంగ్లిష్ లో ఇచ్చిన తీర్పుల్లో 37 వేల కీలకమైన తీర్పుల కాపీలను ఈజీగా ప్రాంతీయ భాషల్లోకి ట్రాన్స్ లేట్ చేయగలిగినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థలో రాజకీయ పక్షపాతాన్ని చూపరాదని కోరారు. న్యాయ వ్యవస్థ పవిత్రంగా, నిజాయతీగా ఉండాలని సూచించారు.