తెలుగులో మాట్లాడకపోతే సంతృప్తి ఉండదు

తెలుగులో మాట్లాడకపోతే సంతృప్తి ఉండదు

హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ సదస్సులో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన తెలుగు బిడ్డ పీవీ నర్సింహారావు అని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో మాట్లాడుతూ.. భోజనంలో పెరుగన్నం తినకపోతే ఎలాగైతే సంతృప్తి ఉండదో.. అలాగే తెలుగులో మాట్లాడకపోతే సంతృప్తి ఉండదని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.

‘న్యాయం చెప్పాలంటే కోర్టులు మాత్రమే అవసరం లేదు. లా డిగ్రీ, నల్ల కోటు వేసుకున్న వాళ్లు మాత్రమే న్యాయం చెప్పాల్సిన  అవసరం లేదు. సమాజంలో గౌరవం ఉన్న ఏ వ్యక్తులు అయినా తీర్పులు చెప్పడానికి అర్హులు. సమస్యను అర్థం చేసుకునే శక్తి ఉన్నవాళ్లు, విశ్వసనీయత ఉన్నవాళ్లు తీర్పులు చెప్పొచ్చు. ప్రభుత్వం, అధికారులు కూడా న్యాయం చేయొచ్చు. ఆర్బిటర్ సెంటర్ లో పెద్దలు పాల్గొని అనేక సమస్యలు పరిష్కారం చేయొచ్చు. గరికపాటి లాంటి అవధానులు, వక్తలు ఈ కేంద్రం ప్యానల్ లో భాగస్వామ్యం కావాలని ఆశిస్తున్నాను. డిసెంబర్18న ఈ సెంటర్ ప్రారంభం అవుతుంది. సీఎం కేసీఆర్ ది పెద్ద చేయి.. ఏం చేసినా పెద్ద మనసుతో చేస్తారు. మా సెంటర్ కి కూడా అలాగే అన్ని తానై సహకరించారు’ అని ఎన్వీ రమణ అన్నారు.