దేశాన్నే మూసేయండి.. ఎన్నికలు ఆపేయండి! : సీజేపీ చీఫ్ దీప్కే

దేశాన్నే మూసేయండి.. ఎన్నికలు ఆపేయండి! : సీజేపీ చీఫ్ దీప్కే
  • ఢిల్లీ ఆంక్షలపై సీజేపీ చీఫ్ దీప్కే ఫైర్
  • ఇది మోదీ మార్కు ఎమర్జెన్సీ
  • జెన్ జీ అంటే కేంద్రానికి భయం
  • ముంబై, బెంగళూరులో పర్మిషన్ ఇచ్చి.. 
  • ఢిల్లీలోనే ఎందుకు ఇవ్వడం లేదు
  • సీఈసీ జ్ఞానేశ్ రాజీనామాకు డిమాండ్

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నిరసన తెలిపే హక్కును ఆంక్షలతో అడ్డుకుంటున్నారని కాక్రోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనతా పార్టీ చీఫ్​ అభిజీత్ దీప్కే అన్నారు. ముంబై, బెంగళూరుల్లో నిరసనలు చేపట్టేందుకు అవకాశం ఉన్నప్పుడు ఢిల్లీలో ఎందుకు అనుమతించడం లేదని నిలదీశారు. “ముంబై, బెంగళూరులో నిరసన తెలిపేందుకు అనుమతి ఇచ్చి ఢిల్లీలో ఎందుకు కుదరదంటున్నారు? ఢిల్లీ ఏదైనా వేరే రాజ్యాంగం కింద నడుస్తోందా?” అని అభిజీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీప్కే ప్రశ్నించారు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 10న జంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద ప్రధాన ఎన్నికల కమిషనర్​(సీఈసీ) జ్ఞానేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజీనామా కోరుతూ తలపెట్టిన నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతివ్వని విషయం తెలిసిందే.

జెన్ జీ అంటే మోదీకి భయం

కేంద్ర ప్రభుత్వం జెన్ జీకి భయపడుతోందని దీప్కే అన్నారు. ఇది మోదీ మార్కు ఎమర్జెన్సీ అని విమర్శించారు. దేశం నలుమూలల నుంచి వచ్చే పలు రైళ్లను రద్దు చేయడంపై దీప్కే అసహనం వ్యక్తం చేశారు. భద్రతా బలగాలను మోహరించి యువతను భయాందోళనకు గురిచేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఈ దేశ యువత ఇక ఎంతమాత్రమూ మోదీకి భయపడబోదని కుండబద్దలు కొట్టారు. తమ పార్టీ జాతీయ సంస్థాగత సహ బాధ్యుడు దీపక్ బలియాను రాజస్థాన్​లో గృహ నిర్బంధంలో ఉంచారని ఆరోపించారు. ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితి ఎమర్జెన్సీని తలపిస్తోందని సీజేపీ నేత సౌరవ్ దాస్ విమర్శించారు.