- రాష్ట్రపతి ముర్ముతో భేటీ తర్వాత మీడియాతో ప్రతిపక్ష నేత
- ఎల్లుండి సీజేఐని కలిసి మెమోరాండం సమర్పిస్తామని వెల్లడి
- దేశంలో ఆర్థిక ఉగ్రవాదం అమలు చేస్తున్న కేంద్రం: ఖర్గే
న్యూఢిల్లీ: ఓట్ చోరీ ఆరోపణలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఖండించలేదని, రాష్ట్రపతి స్పందన తనను ఆశ్చర్యానికి గురి చేసిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చెప్పారు. ఎన్నికల వ్యవస్థలో అక్రమాలకు సంబంధించిన ప్రూఫ్స్ ఇవ్వాలని ఆమె అడిగారని.. తమ వద్ద అన్ని ఆధారాలూ ఉన్నాయన్నారు. ‘‘ఎన్నికల ఫలితాలను ఎలా దొంగిలించారనేదానికి మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. వాటిని దేశమంతా చూసింది” అని అన్నారు. శుక్రవారం ఇండియా కూటమి పార్టీల ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిసి మెమోరాండం సమర్పించింది.
రాష్ట్రపతితో సమావేశం తర్వాత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘‘మేం సోమవారం సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)ని కలుస్తాం. ఆయనకూ ఒక మెమొరాండం అందజేస్తాం” అని వెల్లడించారు. కాగా, రాష్ట్రపతితో ప్రతిపక్ష పార్టీల బృందం సమావేశంపై రాష్ట్రపతి కార్యాలయం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. అయితే, ప్రతిపక్ష నేతలు ఇచ్చిన మెమోరాండంలో ప్రధానంగా ఆరు డిమాండ్లను పేర్కొన్నారు. ‘‘సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి. సీఈసీ, ఈసీలకు జీవితకాల రక్షణ కల్పించే 2023 చట్టం రద్దు చేయాలి. సర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలి. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన మొత్తం 13.3 కోట్ల ఓట్లను పునరుద్ధరించాలి. అన్ని ఎన్నికల్లో తిరిగి బ్యాలెట్ పేపర్ విధానం ప్రవేశపెట్టాలి. గత రెండేళ్లలో ఓట్ చోరీకి కచ్చితమైన ఆధారాలు సమర్పించిన అన్ని అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలి”అని కోరారు.
పార్లమెంట్ నుంచి రాష్ట్రాపతి భవన్‌కు మార్చ్
రాష్ట్రపతితో సమావేశానికి ముందు పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఇండియా కూటమికి చెందిన సుమారు150మంది ఎంపీలు, నాయకులు సమావేశం నిర్వహించారు. తర్వాత ప్రతిపక్ష ఎంపీలు, నాయకుల బృందంతో రాహుల్ గాంధీ పార్లమెంట్ నుంచి రాష్ట్రాపతి భవన్‌కు మార్చ్ నిర్వహించారు. అక్కడ 16 వేర్వేరు పార్టీలకు చెందిన 16 మంది నాయకులు రాష్ట్రపతికి సమర్పించాల్సిన మెమొరాండంపై సంతకం చేశారు. పది మంది నాయకులతో కూడిన బృందం సమావేశానికి లోపలికి వెళ్లగా, మిగిలిన వారు మార్గమధ్యంలోని కర్తవ్య పథ్‌లో బైఠాయించారు.
‘‘జ్ఞానేశ్, ఇట్స్ డన్ బ్రో! (జ్ఞానేశ్ ఇక చాలు)” అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని.. ఓట్ చోర్, ఈసీ, మోదీ సర్కార్ కుమ్మక్కు అంటూ నినాదాలు చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన సమావేశం తర్వాత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనలు కేంద్ర ప్రభుత్వ పునాదులను కదిలించాయని అన్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. జంతర్ మంతర్‌లో నిరసనల నేపథ్యంలో మెట్రో స్టేషన్ల మూసివేత, ట్రెయిన్ సర్వీసులు రద్దు చేయడం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం భయపడుతున్నట్టు స్పష్టమవుతోందని అన్నారు. ‘‘భయపడేవాడు ఈరోజు కాకపోతే రేపు చస్తాడు” అని కామెంట్ చేశారు.
