భద్రత పేరుతో ఢిల్లీని స్తంభింపజేయొద్దు..ఈగను చంపేందుకు సుత్తి వాడ్తరా? : సుప్రీం కోర్టు

భద్రత పేరుతో ఢిల్లీని స్తంభింపజేయొద్దు..ఈగను చంపేందుకు సుత్తి వాడ్తరా? : సుప్రీం కోర్టు
  • ఢిల్లీ మెట్రో, రైళ్ల నిలిపివేతపై సుప్రీం సీరియస్‌‌
  • అందరికీ కార్లు లేవు.. ప్రజా రవాణాను ఆపొద్దు
  • సామాన్యుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవాలె
  • నిషేధం కాదు.. నియంత్రణతో సేవలందించాలి
  • సర్కారు అతిగా వ్యవహరించవద్దన్న న్యాయస్థానం

న్యూఢిల్లీ: నిరసనల నియంత్రణ పేరుతో ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈగను చంపేందుకు సుత్తిని ఉపయోగించినట్లు అతిగా వ్యవహరించరాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. శాంతిభద్రతల పరిరక్షణకు నియంత్రణ చర్యలు తీసుకోవచ్చని, అంతమాత్రాన నగరంలో రవాణా వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేయడం సమంజసం కాదని స్పష్టం చేసింది. ఢిల్లీలో అక్టోబర్‌‌‌‌ 10న ప్రధాన ఎన్నికల కమిషనర్‌‌ జ్ఞానేశ్‌‌ కుమార్‌‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ, ప్రతిపక్ష పార్టీలు తలపెట్టిన నిరసనల నేపథ్యంలో మెట్రో స్టేషన్ల మూసివేత, రైళ్ల రద్దుపై దాఖలైన పిటిషన్లను శుక్రవారం విచారించిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

అందరికీ కార్లు ఉండవు

ప్రజా రవాణాపై ఆధారపడే సామాన్యుల ఇబ్బందులే తమ ప్రధాన ఆందోళన అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ సూర్యకాంత్‌‌ అన్నారు. గురుగ్రామ్‌‌, గ్రేటర్‌‌ నోయిడా, తూర్పు ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ నుంచి ఉపాధి కోసం రాజధానికి వచ్చే వందలాది, వేలాది మంది ప్రయాణికుల పరిస్థితిని ప్రస్తావించారు. వారిలో విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు ఉన్నారని గుర్తుచేశారు. అందరికీ కార్లు ఉండవని, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉండవని, జనం ప్రజా రవాణాపైనే ఆధారపడతారని వ్యాఖ్యానించారు. ప్రయాణ సదుపాయాలన్నింటినీ నిలిపివేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేయలేమని స్పష్టం చేశారు.

నిషేధం కాదు.. నియంత్రణ

చట్ట వ్యవస్థల పరిరక్షణ కోసం అధికారులకు నియంత్రణ చర్యలు తీసుకునే అధికారం ఉందని ధర్మాసనం గుర్తుచేసింది. నియంత్రణ అంటే పూర్తిగా నిషేధించడం కాదని స్పష్టం చేసింది. నిరసనల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడంలో తప్పులేదని, కానీ వాటి ప్రభావం సామాన్యులపై పడకుండా చూడాలని సూచించింది. ఈ విషయంలో ‘ప్రపోర్షనాలిటీ’ (అవసరానికి తగిన స్థాయిలోనే చర్యలు తీసుకోవడం) సూత్రాన్ని పాటించాలని పేర్కొంది. భద్రత కోసం ముందుజాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, రైళ్లు, మెట్రో సేవలన్నింటినీ నిలిపివేయడం మాత్రం తగదని తెలిపింది. మెట్రో రైళ్ల రాకపోకలను నియంత్రించవచ్చని, అవసరమైతే సర్వీసుల ఫ్రీక్వెన్సీని తగ్గించవచ్చని జస్టిస్‌‌ జాయ్‌‌మాల్య బాగ్చి అభిప్రాయపడ్డారు. కానీ సేవలను పూర్తిగా రద్దు చేయడం తీవ్ర చర్య అవుతుందన్నారు.  

కేరళ రైలును ఆపేశారు

విచారణ సందర్భంగా సీనియర్‌‌ న్యాయవాది కపిల్‌‌ సిబల్‌‌ కీలక అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అక్టోబర్‌‌ 10న ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ, హజ్రత్‌‌ నిజాముద్దీన్‌‌ రైల్వే స్టేషన్లకు చేరుకోవాల్సిన కొన్ని రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. దీనివల్ల కేరళ నుంచి ఢిల్లీకి రావాల్సిన రైలు కూడా చేరుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని ఉదాహరణగా పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీజేఐ.. అవసరానికి మించి ఆంక్షలు విధించకుండా, పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రయాణికులకు అడ్వైజరీ ఇవ్వాలె

మెట్రో, రైల్వే సేవలను పూర్తిగా నిలిపివేయకుండా, తగిన నియంత్రణలతో కొనసాగించేలా అధికారులతో మాట్లాడతానని సొలిసిటర్‌‌ జనరల్‌‌ తుషార్‌‌ మెహతా ధర్మాసనానికి హామీ ఇచ్చారు. ఈ హామీని నమోదు చేసుకున్న కోర్టు.. మెట్రో, రైళ్ల రాకపోకలపై అధికారులు తీసుకునే నిర్ణయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించింది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా వార్తాపత్రికలు, వెబ్‌‌సైట్ల ద్వారా అడ్వైజరీని ప్రచురించాలని సూచించింది.

కొన్ని ప్రాంతాల్లోనే ఇంటర్నెట్ సేవలు బంద్

సీజేపీ నిరసనలకు అనుమతి నిరాకరించడం, నిరసనకారులపై పోలీసులు తీసుకున్న ఇతర చర్యలపై కూడా విచారణ సందర్భంగా ప్రస్తావనలు వచ్చాయి. నిరసనకారుల వల్ల గతంలో పోలీసులకు ఇబ్బందులు ఎదురయ్యాయని, మహిళా పోలీసులపై వేధింపులు జరిగాయని సొలిసిటర్‌‌ జనరల్‌‌ పేర్కొన్నారు. ఇంటర్నెట్‌‌ నిలిపివేత కొన్ని సున్నిత ప్రాంతాలకే పరిమితమని, పరిస్థితిని బట్టి సమీక్షిస్తామని తెలిపారు. మసీదులకు వెళ్లి నిరసనల్లో పాల్గొనవద్దని పోలీసులు సూచిస్తున్నారన్న అంశాన్ని సీనియర్‌‌ న్యాయవాది వృందా గ్రోవర్‌‌ లేవనెత్తగా, ఆ అంశాలపై తాము ప్రస్తుతం విచారణ జరపడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.