- మహారాష్ట్రలో సీట్ల పంపకాలపై ఎంవీఏలో క్లారిటీ
- వంద సీట్లలో కాంగ్రెస్ పోటీ
- ఉద్ధవ్ పార్టీకి 80కి పైగా సీట్లు
- 70 సీట్లలో ఎన్సీపీ అభ్యర్థులు
- చిన్న పార్టీలకు 2-3 స్థానాలు ఇచ్చే చాన్స్
- వెల్లడించిన కూటమి వర్గాలు
- విదర్భ సీట్ల కోసం శివసేన పట్టు
ముంబై : మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లోని పార్టీలు సీట్ల పంపకాలపై ఓ స్పష్టతకు వచ్చాయి. మొత్తం 288 సీట్లకు 260 సీట్ల షేరింగ్‌పై ఏకాభిప్రాయం కుదిరినట్టు కూటమి వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం జరిగిన కీలక భేటీలో కూటమిలోని కాంగ్రెస్, శివసేన(యూబీటీ), ఎన్సీపీ (శరద్‌పవార్) సీట్ల పంపకాలపై చర్చించుకొని, ఓ అంగీకారానికి వచ్చినట్టు తెలిపాయి.
లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ప్రదర్శన ఆధారంగా కాంగ్రెస్‌కు 110–115 సీట్లు ఇచ్చేందుకు కూటమి ఒప్పుకొన్నట్టు పేర్కొన్నాయి. ఇక తనకు బాగా పట్టున్న ముంబై, కొంకణ్ బెల్ట్ లో శివసేన (యూబీటీ) 83–86 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలుపనున్నది. కూటమిలో మరో బలమైన పార్టీ ఎన్సీపీ (శరద్‌పవార్)కు 72–75 సీట్లు ఇచ్చేందుకు ఎంవీఏ కూటమి ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఈ పార్టీ పశ్చిమ మహారాష్ట్రపై ఫోకస్ పెట్టనున్నది. ఈ స్థానాల్లో ఎన్సీపీ (అజిత్ పవార్) ఎక్కువ స్థానాల్లో సత్తా చాటాలని చూస్తుండడంతో ఎన్సీపీ(శరద్‌పవార్)కు ఇది కీలక యుద్ధభూమిగా మారింది. అలాగే, మిగిలిన సీట్లలో కూటమిలోని మిగతా పార్టీలు తమ అభ్యర్థులను బరిలో నిలపనున్నాయి.
చిన్న పార్టీలకు కేటాయింపుల్లోనూ సవాళ్లు
మొత్తం అసెంబ్లీ స్థానాల్లోని మెజార్టీ సీట్ల పంపకాలపై స్పష్టత వచ్చినా.. మిగిలిన సీట్లను చిన్న పార్టీలకు షేర్ చేయడంలో ఎంవీఏ సవాళ్లను ఎదుర్కొంటున్నది. సమాజ్‌వాదీ పార్టీ తమకు 12 సీట్లు కావాలని పట్టుబడుతున్నది. ఇక్కడ తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేస్తున్నది. ప్రస్తుతం ఆ పార్టీకి మహారాష్ట్రలో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ముంబై, భివండి అసెంబ్లీ స్థానాల్లో వీరు కొనసాగుతున్నారు.
కాగా, ఇప్పటివరకూ ఎస్పీ డిమాండ్‌పై ఎంవీఏ కూటమిలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. శుక్రవారం జరిగిన కీలక మీటింగ్‌కు ఎస్పీని ఆహ్వానించలేదు. సమాజ్‌వాదీ పార్టీతోపాటు లెఫ్ట్‌పార్టీలు, పీసెంట్స్అండ్ వర్కర్స్ పార్టీకి 2–3 సీట్ల చొప్పున కేటాయించే అవకాశాలున్నట్టు కూటమి సీనియర్ నేత తెలిపారు. చిన్న పార్టీలను కలుపుకొని పోతేనే మహాయుతి కూటమిని ఎదుర్కోగలమని ఎంవీఏ భావిస్తున్నది.
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడితో ఇక చర్చల్లేవ్ : ఉద్ధవ్
నెలరోజుల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనుండగా.. ఎంవీఏ కూటమిలోని కాంగ్రెస్, శివసేన (యూబీటీ) మధ్య అభిప్రాయ భేదాలు నెలకొన్నాయి. సీట్ల పంపకాలపై తాము కూటమిలోని అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలేతో చర్చలు జరపబోమని శివసేన అంటున్నది. కూటమిలోని మిత్రపక్షాలు 200 సీట్లపైనే ఏకాభిప్రాయానికి వచ్చాయని, మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలకు నిర్ణయాలు తీసుకొనే సత్తాలేదని నానా పటోలేను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పరోక్షంగా విమర్శించారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీట్ల షేరింగ్‌పై తాను కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు కేసీ వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్, ఆ పార్టీ మహారాష్ట్ర ఇన్చార్జి రమేశ్ చెన్నితాలతో మాట్లాడానని, రాహుల్ గాంధీతోనూ చర్చిస్తానని చెప్పారు. ఎన్నికలకు సమయం దగ్గరపడిందని, సీట్ల పంపకాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. కాగా, విదర్భలో ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని శివసేన భావిస్తుండగా.. దీన్ని పటోలే పరిగణలోకి తీసుకోలేదని, దీనిపైనే అభిప్రాయ భేదాలు వచ్చినట్టు తెలిసింది. ముంబైలో ఉద్ధవ్ ఠాక్రేతో మహారాష్ట్ర ఇన్చార్జి రమేశ్ చెన్నితాల సమావేశమై, రెండు పార్టీల మధ్య నెలకొన్న పీటముడి విప్పుతారని సమాచారం.
28 సీట్లపై మూడు పార్టీల పట్టు
288 అసెంబ్లీ స్థానాలకుగానూ 260 చోట్ల ఎంవీఏ కూటమి సీట్ల పంపకాలపై స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తున్నా.. ఇంకా 28 సీట్లలో పీటముడి వీడలేదు. ఈ సీట్లపై కూటమిలోని 3 పార్టీలు పట్టుబట్టడంతో వాటిపై క్లారిటీ రాలేదని కూటమిలోని ఓ సీనియర్ నాయకుడు తెలిపారు. ఈ స్థానాల్లో కూటమిలోని ఏ పార్టీ పోటీ చేస్తుందనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయని, ఈ శనివారంలోపు ఓ నిర్ణయానికి రానున్నట్టు చెప్పారు. ఆ స్థానాల్లో అన్ని పార్టీలు తాము విజయం సాధిస్తాయనే ధీమాతో ఉన్నాయని, కూటమిలోని అన్ని పార్టీలను సంతృప్తిపరిచే విధంగా ఆ సీట్ల పంపకాలు చేపడతామని వెల్లడించారు.