రెరాకు జీఎస్టీ రద్దుపై త్వరలో క్లారిటీ

రెరాకు జీఎస్టీ రద్దుపై త్వరలో క్లారిటీ

న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లించాల్సిన అవసరం లేదని జీఎస్టీ కౌన్సిల్ త్వరలో స్పష్టం చేసే అవకాశం ఉందని ఒక అధికారి తెలిపారు. రియాల్టీ రంగానికి రెగ్యులేటర్  ఫెసిలిటేటర్‌‌‌‌‌‌‌‌గా పనిచేసే ఈ నియంత్రణ సంస్థను రాజ్యాంగంలోని ఆర్టికల్ 243జీ ప్రకారం ఏర్పాటు చేశారు. ఇది పంచాయతీల అధికారాలు, బాధ్యతల గురించి వివరిస్తుంది.

రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో పారదర్శకతను నిర్ధారించడానికి, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి,  సత్వర వివాద పరిష్కారానికి వివిధ రాష్ట్రాల్లో రెరాను ఏర్పాటు చేశారు. రెరా సభ్యులతో చర్చించిన తర్వాత సంస్థకు జీఎస్టీ వర్తించదని నిర్ణయించినట్లు అధికారి తెలిపారు. రెరాలకు నిధులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూరుస్తాయని, వీటిపై జీఎస్టీ విధించడం అంటే రాష్ట్ర ప్రభుత్వాలపై పన్ను విధించడమేనని అధికారి తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్–-మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నిబంధనలను విధించడానికి ముందు కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన, రాష్ట్ర మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశం ఉంది. జీఎస్టీ కౌన్సిల్  చివరి సమావేశం అక్టోబర్ 7, 2023 న జరిగింది.

రిజర్వ్ బ్యాంక్, సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ అథారిటీ (ఐఆర్​డీఏ), ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్​ సహా భారతదేశంలోని కీలక నియంత్రణ సంస్థలు అందించే కొన్ని సేవలకు జీఎస్టీ వర్తించదని సంబంధిత అధికారులు తెలిపారు. ఇదే మినహాయింపు రెరాకూ వర్తిస్తుందని అన్నారు.