ఒమిక్రాన్ పై బుగులొద్దన్న సీసీఎంబీ

ఒమిక్రాన్ పై బుగులొద్దన్న సీసీఎంబీ
  • తీవ్రతపై 15 రోజుల్లో క్లారిటీ
  • ఒమిక్రాన్ పై బుగులొద్దన్న సీసీఎంబీ  

సికింద్రాబాద్, వెలుగు: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి అంతగా భయపడాల్సిన పనిలేదని హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సైంటిస్టులు స్పష్టం చేశారు. ప్రజలంతా మాస్కులు పెట్టుకోవడం, దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని, అందరూ టీకాలు వేసుకోవాలని సూచించారు. ఒమిక్రాన్ తీవ్రత ఎలా ఉంటుంది? ఇదివరకే వైరస్ సోకినోళ్లకు ఇన్ఫెక్షన్ కలుగుతుందా? వ్యాక్సిన్ తీసుకున్నోళ్లకు ప్రొటెక్షన్ ఉంటుందా? అన్నవి స్పష్టంగా తెలియదని, ప్రస్తుత రీసెర్చ్ లు ఒక కొలిక్కి వస్తేనే ఇవన్నీ తేలుతాయని అంటున్నారు. మరో 15 రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. కరోనా వేరియంట్లకు సంబంధించి సీసీఎంబీలో 800 శాంపిల్స్ ఉన్నాయని సంస్థ డైరెక్టర్ వినయ్ కుమార్ వెల్లడించారు. కొత్త వేరియంట్లను గుర్తించేందుకు ఇప్పటివరకు ఎయిర్ పోర్టుల నుంచి పది శాంపిల్స్ మాత్రమే వచ్చాయన్నారు. శాంపిల్స్ కు 72 గంటల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి వేరియంట్లను గుర్తిస్తున్నట్లు చెప్పారు. కొత్త వేరియంట్ పై సీసీఎంబీతో పాటు బెంగళూరు, ఢిల్లీ, పుణె లోని ల్యాబ్‌‌‌‌లలో రీసెర్చ్ జరుగుతోందని సీసీఎంబీ మాజీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు.

ప్రస్తుత టీకాలు పన్జేస్తయా?
కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్ లలో ఎక్కువ మ్యుటేషన్లు జరిగితే వాటిపై టీకాల ఎఫెక్ట్ తక్కువగానే ఉంటుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఇంతకుముందు డెల్టా వేరియంట్ సోకినవారిలో కొన్ని టీకాలు 50%, మరికొన్ని టీకాలు 20% నుంచి 30% మాత్రమే పనిచేశాయని పేర్కొంటున్నారు. అయితే ఒమిక్రాన్ తో ఇప్పటివరకు మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే వస్తున్నాయని, అంతగా భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు పాటిస్తే చాలని చెప్తున్నారు.