చెరువు తవ్వకాన్ని అడ్డుకున్న గొత్తికోయలు..

చెరువు తవ్వకాన్ని అడ్డుకున్న గొత్తికోయలు..

ములకలపల్లి,వెలుగు: తాము సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులు కుంట తవ్వుతుండడంతో ఆగ్రహించిన గొత్తి కోయలు వారిపై దాడి చేశారు. ఈ సందర్భంగా ఓ బీట్​ఆఫీసర్​ గాయపడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కొత్త గుండాలపాడు శివారులో బుధవారం ఈ ఘటన జరిగింది. గుండాలపాడు జీపీ పరిధిలోని గుండాలపాడు, చలమన్న నగర్, చింతలపాడు, పాత గుండాలపాడు, పగడాల నగర్, పాలవాగు, పర్రెగుంపు గ్రామాలకు చెందిన సుమారు 400 మంది పోడు సాగుదారులున్నారు. 

వీరిలో 92 మందికి గత ప్రభుత్వం పోడు పట్టాలు ఇచ్చింది. మిగతా 302 మందికి రాలేదు. దీంతో చలమన్ననగర్​కు చెందిన కొంతమంది గొత్తి కోయలు కొత్త గుండాలపాడు శివారులో కొన్నేండ్లుగా పోడు సాగు చేస్తున్నారు. ఈ భూమిలో గుండాలపాడు ఎఫ్ బీవో వెంకన్న నాయక్, సిబ్బందితో కలిసి చెరువు తవ్వుతుండగా అడ్డుకుని దాడి చేశారు. ఎఫ్ బీవో వీపు, చేతులపై గాయాలయ్యాయి. ఘటనపై ఆయన స్థానిక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.