గాంధీభవన్ లో తన్నుకున్న లీడర్లు

గాంధీభవన్ లో తన్నుకున్న లీడర్లు

రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. హైదరాబాద్ గాంధీ భవన్ లో రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు సన్మాన కార్యక్రమం జరిగింది. బడుగు, బలహీన వర్గాల నాయకుడు భట్టి విక్రమార్కకు సీఎల్పీ ఇచ్చినందుకు పార్టీ అధిష్టానానికి ఓబీసీ సెల్ చైర్మన్ చిత్తరంజన్ దాస్ థాంక్స్ చెప్పారు. సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేస్తామని చెప్పిన మల్లు భట్టి విక్రమార్క.. ఓబీసీ సెల్ వేదికగా నాయకులు.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని కోరారు.

సీఎల్పీ నేత సన్మాన కార్యక్రమంలో అంతకుముందు గొడవ జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వి.హనుమంతరావు తమ నాయకుడికి అంబర్ పేట్ ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకున్నారంటూ…. గ్రేటర్ హైదరాబాద్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు శ్రీకాంత్ వర్గీయులు నిరసన తెలిపారు. వీహెచ్ డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. శ్రీకాంత్ వర్గీయులు, వీహెచ్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. నాయకులు, అనుచరులు… ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. మల్లు భట్టివిక్రమార్క సహా సీనియర్లు కల్పించుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు.