నెల రోజుల్లో కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లు.. మేడిగడ్డ వద్ద టెస్టులు ప్రారంభించిన సీడబ్ల్యూపీఆర్‌‌‌‌ఎస్: మంత్రి ఉత్తమ్

నెల రోజుల్లో కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లు.. మేడిగడ్డ వద్ద టెస్టులు ప్రారంభించిన సీడబ్ల్యూపీఆర్‌‌‌‌ఎస్: మంత్రి ఉత్తమ్
  • నేటి నుంచి అన్నారం, సుందిళ్ల వద్ద కూడా పరీక్షలు
  • ఎస్‌‌ఎల్‌‌బీసీ టన్నెల్ పనుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా డివిజన్​
  • తుమ్మిడిహెట్టి బ్యారేజ్ సైట్ వద్ద ల్యాండ్ సర్వే పనులు పూర్తి
  • ప్రాధాన్య ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలి
  • అధికారులతో రివ్యూలో మంత్రి వార్నింగ్​

హైదరాబాద్​, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలకు నెల రోజుల్లో పునరుద్ధరణ డిజైన్లు రెడీ అవుతాయని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బ్యారేజీలకు సంబంధించి సైట్ ఇన్‌‌స్పెక్షన్ రిపోర్టులను సీడబ్ల్యూపీఆర్‌‌‌‌ఎస్  (సెంట్రల్ వాటర్ పవర్ అండ్ రీసెర్చ్ స్టేషన్) సమర్పించిందన్నారు. ఎప్పుడెప్పుడు టెస్టులు చేస్తారన్న షెడ్యూల్‌‌ కూడా ఇచ్చిందని చెప్పారు. బుధవారం నుంచి మేడిగడ్డ వద్ద ముగ్గురు సభ్యుల టీమ్ టెస్టులను ప్రారంభించిందన్నారు. మరో ఇద్దరు సభ్యుల బృందం బోర్‌‌‌‌హోల్ లొకేషన్ల కోసం అన్వేషణ చేస్తోందని తెలిపారు. గురువారం నుంచి అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద కూడా టెస్టులు మొదలవుతాయని తెలిపారు. 

మూడు బ్యారేజీలకు సంబంధించి కేవలం నెలలోపే రీహాబిలిటేషన్ డిజైన్లు ఇవ్వాలని స్పష్టం చేశారు. బుధవారం సెక్రటేరియెట్‌‌లోని తన చాంబర్‌‌‌‌లో వివిధ ప్రాజెక్టుల అంశాలపై అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి ఉత్తమ్‌‌ మాట్లాడారు. ఎస్‌‌ఎల్‌‌బీసీ టన్నెల్ పనులను వీలైనంత వేగంగా పూర్తి చేసేందుకు ప్రాధాన్య క్రమంలో ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. ఎస్‌‌ఎల్‌‌బీసీ పనులను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక డివిజన్‌‌ను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. టన్నెల్‌‌లో ఇరుక్కుపోయిన టన్నెల్ బోరింగ్ మెషీన్‌‌ను పూర్తిగా బయటకు తెచ్చారని, దీంతో మిగతా పనులు పూర్తి చేసేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పారు. ప్రస్తుతం టన్నెల్‌‌లోని రైల్ ట్రాక్ మెయింటెనెన్స్, రిపేర్ల పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. 

తుమ్మిడిహెట్టి వద్ద సైట్ సర్వేలు పూర్తి..

తుమ్మిడిహెట్టి బ్యారేజీ డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్​(డీపీఆర్) కోసం నిర్మాణ స్థలం వద్ద వేగంగా సర్వేలు జరుగుతున్నాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. బ్యారేజ్ లొకేషన్ వద్ద 73 చదరపు కిలోమీటర్లతో పాటు 85 కిలోమీటర్ల కెనాల్ అలైన్‌‌మెంట్ వరకు సర్వేలు పూర్తయ్యాయని చెప్పారు. వార్దా, వైన్‌‌ గంగ నదుల క్రాస్ సెక్షన్ల వద్ద కూడా సర్వే పూర్తయిందని వెల్లడించారు. డీపీఆర్ కోసం త్వరగా టెస్టులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పాలమూరు– రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచాలని, దీని పనులపై రోజూ రివ్యూ చేయాలని ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జాను మంత్రి ఆదేశించారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు వీలైనంత త్వరగా పర్యావరణ అనుమతులు తీసుకొచ్చేలా అధికారులు పనిచేయాలన్నారు. ఇప్పటికే ప్రారంభించిన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వొచ్చంటూ ఇటీవల సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని, అయినా, ప్రాజెక్టుల అనుమతుల స్టేటస్ మారడం లేదన్నారు. ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర జల శక్తి శాఖకు తెలియజేశామని, సీఎంతో చర్చించి పీఎం ఆఫీసుకు కూడా తీసుకెళ్తామని ఆయన అన్నారు. 

కమీషన్ల కోసం విధానాలు మారిస్తే సహించం..

ప్రాధాన్య ప్రాజెక్టుల పనులకు వీలైనంత తొందరగా నిధులు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారని, ఈ నేపథ్యంలో అధికారులు జవాబుదారీతనంలో పనిచేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌‌‌‌ రెడ్డి ఆదేశించారు. ఎలాంటి ఆరోపణలు, విమర్శలకు తావులేకుండా ప్రాజెక్టుల పనులు చేయాలని చెప్పారు. కమీషన్లకు పోయి పనుల విధివిధానాల్లో ఏవైనా మార్పులు చేయిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాగా, పోలవరం నల్లమలసాగర్ ప్రాజెక్టుపై సూట్‌‌ను వీలైనంత త్వరగా సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. సూట్ డ్రాఫ్ట్ వచ్చాక అడ్వకేట్  జనరల్‌‌తో లీగల్ ఒపీనియన్ తీసుకుంటామన్నారు. సమ్మక్క సాగర్​ప్రాజెక్ట్ ఎన్‌‌వోసీ కోసం త్వరలోనే ప్రిన్సిపల్ సెక్రటరీ చత్తీస్‌‌గఢ్​వెళ్లి ఆ ప్రభుత్వంతో చర్చలు జరుపుతారన్నారు. సోషియో ఎకనమిక్ సర్వే కోసం రూ.10 కోట్లు అక్కడి ప్రభుత్వం అడిగిందని మంత్రి పేర్కొన్నారు.