దుబ్బాకలో టీఆర్ఎస్ దాడిలో బీజేపీ నేతకు గాయం

దుబ్బాకలో టీఆర్ఎస్ దాడిలో బీజేపీ నేతకు గాయం

దుబ్బాక, వెలుగు: దుబ్బాక పట్టణంలో బుధవారం టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మంత్రులను విమర్శించడాన్ని  నిరసిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు ఆయన  దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు సిద్ధం అయ్యారు. గమనించిన టీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఎదుట ఇరుపార్టీల నేతలు,  కార్యకర్తలు ఎదురెదురుగా నిలబడి వ్యతిరేక నినాదాలు చేయడం ప్రారంభించారు. దుబ్బాక మహిళా కౌన్సిలర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పు, చీపుర్లు చూపుతూ బస్టాండ్ ఎదుట బైఠాయించారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సైతం టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు మొదలు పెట్టారు. పోలీసులు ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేసినా ఎవరూ వెనక్కి తగ్గలేదు.

దుబ్బాక బస్టాండ్ ప్రాంతంలో  ఇరు పార్టీల మధ్య సుమారు రెండు గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ గొడవ సందర్భంగా విసిరిన రాయి తగిలి హబ్షీపూర్ మాజీ ఎంపీటీసీ, బీజేపీ నాయకుడు పుట్ట షాదుల్ స్వామికి స్వల్ప గాయాలయ్యాయి. గంట తర్వాత స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీజేపీ నాయకులు కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. భూంపల్లి, తొగుటల్లో టీఆర్ఎస్ నేతలు రఘునందన్​రావు దిష్టిబొమ్మల్ని దహనం చేశారు.