
- మహారాష్ట్రలోని అకోలా సిటీలో ఘటన
- నాలుగు చోట్ల సెక్షన్ 144 విధింపు
అకోలా : సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు మహారాష్ట్రలోని అకోలా సిటీలో హింసకు దారితీసింది. ఒక వర్గంవారి మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు గొడవపడ్డారు. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. ఈ ఘర్షణలో ఒకరు చనిపోగా.. ఇద్దరు పోలీసులు సహా ఎనిమిది మంది గాయపడ్డారు. సిటీలోని పాతబస్తీలో శనివారం రాత్రి 11.30 గంటలకు ఈ గొడవ జరిగింది. ఇరు వర్గాల మధ్య గొడవ ప్రారంభమైన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారని ఎస్పీ సందీప్ ఘుగె తెలిపారు. టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారన్నారు. కలెక్టరు ఆదేశాలతో అకోలా నగరంలోని నాలుగు ప్రాంతాల్లో సెక్షన్ 144 విధించామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఆయన వెల్లడించారు. ఈ గొడవకు సంబంధించి 26 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇరు వర్గాల వారికి చెందిన 120 మందిపై కేసులు నమోదు చేశారు. అకోలాలో ఇంటర్ నెట్ సేవలను నిలిపివేశారు.
హింసకు పాల్పడవద్దు: ఫడ్నవీస్
అకోలా సిటీలో జరిగిన గొడవపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఇరు వర్గాల వారు సంయమనం పాటించాలని, హింసకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. హింస నేపథ్యంలో అకోలాలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. అమరావతి నుంచి స్టేట్ రిజర్వ్ పోలీసులను తరలించారు. వదంతులను నమ్మకూడదని స్థానికులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.