హుజూరాబాద్​లో టీఆర్ఎస్, బీజేపీ  కొట్లాట

హుజూరాబాద్​లో టీఆర్ఎస్, బీజేపీ  కొట్లాట
  • బీజేపీ నేతలపైకి చెప్పులు విసిరిన టీఆర్ఎస్ నాయకులు 
  • ఈటల జమున కార్యక్రమానికి అడ్డంకులు
  • ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట
  • సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నేతలు

హుజూరాబాద్, వెలుగు: హుజూరాబాద్​పట్టణంలో ఉద్రికత నెలకొంది. నియోజకవర్గంలో బీజేపీ, టీఆర్​ఎస్ నడుమ కొనసాగుతున్న మాటల యుద్ధం గురువారం ఘర్షణకు దారితీసింది. ఈటల జమున సోదరుడు మధుసూదన్ రెడ్డి దళితులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీఆర్​ఎస్ వాళ్లు.. టీఆర్​ఎస్ నేతలే మార్ఫింగ్ చేసి ఫేక్​ న్యూస్​ సర్క్యులేట్ చేస్తున్నారని బీజేపీ వాళ్లు హుజూరాబాద్ చౌరస్తాలో పోటాపోటీ కార్యక్రమాలు, నినాదాలు చేశారు. టీఆర్ఎస్​ వర్గాలు బీజేపీ లీడర్లపైకి చెప్పులు విసరడం, ఒకరినొకరు తోసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

దిష్టిబొమ్మతో టీఆర్​ఎస్ నేతల శవయాత్ర..

మధుసూదన్ రెడ్డి దళితులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని ఆరోపిస్తూ గురువారం ఉదయం ఎస్సీసెల్ చైర్మన్ బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు.. హుజూరాబాద్​ చౌరస్తాలో మధుసూదన్ రెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. ర్యాలీలో ఈటలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రచారంలో భాగంగా ఈటల జమున తన సోదరుడు మధుసూదన్ రెడ్డితో కలిసి మధ్యాహ్నం హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. ఆమె అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అక్కడే ఉన్న టీఆర్ఎస్ లీడర్లు ఈటల ఫ్లెక్సీ పట్టుకొని దళిత ద్రోహి అంటూ నినాదాలు చేశారు. అక్కడ ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటూ ఒకరినొకరు తోసుకున్నారు.

బీజేపీ లీడర్లపై కి చెప్పులు 

టీఆర్ఎస్ నేతలు బీజేపీ లీడర్ల మీదకు చెప్పులు విసరడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలు ఒకరినొకరు తోసుకొని.. బాహాబాహీకి సిద్ధమయ్యారు. పరిస్తితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ప్రశాంతంగా కార్యక్రమం చేసుకుంటున్న తమ దగ్గరకు వచ్చి టీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుంటే పోలీసులు కూడా వారికే వంతపాడటం సరికాదని బీజేపీ లీడర్లు అభ్యంతరం తెలిపారు. అయినప్పటికీ టీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టడం ఆపలేదు. రెండు పార్టీల వారు జమ్మికుంట, వరంగల్ రహదారిపై బైఠాయించారు. సీఐ శ్రీనివాస్ వచ్చి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

దళితులంటే గౌరవముంది: జమున

దళితులంటే అపారమైన గౌరవం ఉందని, వారిని ప్రేమగా చూసేవాళ్లమని ఈటల జమున అన్నారు. అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన తర్వాత ఆమె మాట్లాడుతూ.. ఇదంతా కేసీఆర్ కుట్రలో భాగమన్నారు. టీఆర్​ఎస్ లీడర్లు, వారి అనుచరులు ఫేక్ వార్తలు తయారు చేసి దుష్ర్పచారం చేస్తున్నారని, ఫేక్​న్యూస్​కు కారకులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితబంధు ఈటల రాజేందర్ రాజీనామా వల్లనే వచ్చిందని, ఈ స్కీమ్​ను హుజూరాబాద్ లో మాత్రమే కాకుండా రాష్ట్రమంతటా అమలు చేయాలన్నారు. టీఆర్​ఎస్ తమను రెచ్చగొట్టి గొడవ పెట్టుకోవాలని చూస్తోందని, ప్రజలే వారికి బుద్ధి చెప్తారన్నారు. జమున సోదరుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియాలో తాను ఎలాంటి చాటింగ్ చేయలేదని, రాజేందర్​ను ఎదుర్కోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ ప్రచారం ఎవరు చేస్తున్నారో 48 గంటల్లో  తేల్చకపోతే కమిషనర్ ఆఫీస్ ఎదుట నిరసనకు దిగుతానని హెచ్చరించారు. మాదిగ హక్కుల దండోరా లీడర్​ సునీల్, స్టూడెంట్స్ జేఏసీ నాయకులు నెహ్రూ నాయక్, సురేశ్ యాదవ్ మాట్లాడారు.