నిర్మల్ కాంగ్రెస్ లో చల్లారని మంటలు

నిర్మల్ కాంగ్రెస్ లో చల్లారని మంటలు
  •     ఇంద్రకరణ్ రెడ్డిని చేర్చుకోవద్దంటూ ఆందోళనలు 
  •     డీసీసీ అధ్యక్షుని ఇంటి ముందు కార్యకర్తల ధర్నా 
  •     మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జును కలిసిన శ్రేణులు 

నిర్మల్, వెలుగు :  మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్​ పార్టీలో చేర్చుకోరాదంటూ నిర్మల్ జిల్లా లీడర్లు, కార్యకర్తలు చేస్తున్న ఆందోళనలు ఆగడంలేదు. ఇంద్రకరణ్​ రెడ్డి కాంగ్రెస్​లో చేరేందుకు పార్టీ పెద్దల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఆయనను పార్టీలో చేర్చుకోవద్దంటూ కొనసాగుతున్న నిరసనలు తీవ్రమవుతున్నాయి. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు ఇంటి వద్ద శుక్రవారం పార్టీ కార్యకర్తలు భారీగా మోహరించి ధర్నా చేశారు. అవినీతి ఆరోపణలున్న ఇంద్రకరణ్ రెడ్డిని చేర్చుకుంటే పార్టీ ఉనికికే ప్రమాదమని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ ఈ ప్రభావం ఉంటుందని వారు డీసీసీ అధ్యక్షుడికి వివరించారు. కార్యకర్తల అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని శ్రీహరి రావు హామీ ఇచ్చారు. ఇదివరకే కాంగ్రెస్​ మండల కమిటీలు ఇంద్రకరణ్ రెడ్డి చేర్చుకోవద్దంటూ తీర్మా నాలు చేసి పీసీసీకి పంపాయి. లక్ష్మణ చందా, నిర్మల్, సారంగాపూర్, సోన్ మండలాల్లో ధర్నాలు చేశారు.

సీతక్కను కలిసిన కార్యకర్తలు 

 ఉట్నూరులో పర్యటిస్తున్న జిల్లా ఇన్​చార్జి మంత్రి సీతక్కను కలిసి ఇంద్రకరణ్​ రెడ్డి చేరికపై అభ్యంతరం చెప్పేందుకు నిర్మల్​నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన ఇంద్రకరణ్ రెడ్డిని చేర్చుకోవద్దని సీతక్కను, వెడ్మ బొజ్జు ను కోరారు. ఇంద్రకరణ్​రెడ్డికి పార్టీపెద్దల అండ ఉందని ప్రచారం జరగుతోందని చెప్పారు. 

చీటర్లను పార్టీలో చేర్చుకోం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు 

ఎవరిని పడితే వారిని పార్టీలో చేర్చుకోబోమని, బ్లాక్ మెయిలర్లు, చీటర్లను చేర్చుకునే ప్రసక్తే లేదని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పేర్కొన్నారు. ఆయన ఉట్నూరులో నిర్మల్ నుంచి వచ్చిన కార్యకర్తలతో మాట్లాడారు. చేరిక విషయంలో తాను మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. బొజ్జు అభిప్రాయంతో ఏకీభవిస్తున్నానని, కార్యకర్తల అభిప్రాయాలను గౌరవిస్తామని మంత్రి సీతక్క అన్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసు కుపోయామన్నారు.