
హైదరాబాద్: పదో తరగతి చదువుతోన్న బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ నగర్లో ఫ్యామిలీతో కలిసి ఉంటోన్న హన్సిక నాయక్ (15) పదో తరగతి చదువుతోంది. కారణమేంటో తెలియదు కానీ గురువారం (జూలై 24) ఉన్నట్టుండి బిల్డింగ్ ఐదో అంతస్తు పై నుంచి దూకింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో హన్సిక అక్కడికక్కడే మరణించింది.
మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేప్టటారు. ఘటన స్థలాన్ని పరిశీలించి హన్సిక మరణానికి కారణమేంటన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు చదువు ఒత్తిడా..? లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హన్సిక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.