ఇద్దరూ.. ఇద్దరే..ఖేడ్ కాంగ్రెస్‌‌లో నేతల వర్గపోరు

ఇద్దరూ.. ఇద్దరే..ఖేడ్ కాంగ్రెస్‌‌లో నేతల వర్గపోరు
  •     ఖేడ్ కాంగ్రెస్‌‌లో నేతల వర్గపోరు
  •     టికెట్ పై తగ్గని  సురేష్ షెట్కార్, సంజీవరెడ్డి
  •     హై కమాండ్ కు తప్పని తిప్పలు 

సంగారెడ్డి/ నారాయణఖేడ్, వెలుగు : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సెగ్మెంట్ లో ఇద్దరు కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న వర్గపోరు పార్టీ హై కమాండ్ కు తలనొప్పిగా మారింది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న ఇద్దరు నేతల్లో ఒకరు మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ కాగా మరొకరు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ పట్లోళ్ల సంజీవరెడ్డి. నియోజకవర్గంలో ఈ ఇద్దరి మధ్య రాజకీయ వైరం మొదటి నుంచి కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతానికి ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఉన్నా పార్టీ కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వర్తిస్తూ ఎవరికి వారే తమ బలాన్ని ప్రదర్శిస్తున్నారు.

తాజాగా ఖేడ్ ఎమ్మెల్యే టికెట్ కోసం ఇద్దరు వేర్వేరుగానే ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. ఒకవేళ సురేశ్​ షెట్కార్, సంజీవరెడ్డి కాంప్రమైజ్ అయి ఎవరికి టికెట్టు వచ్చిన కలిసికట్టుగా పనిచేస్తే ఆ ఇద్దరి బలం అధికార పార్టీ బీఆర్ఎస్ కు మైనస్ గా మారే అవకాశముంది. రెండు పర్యాయాలు గెలిచి మూడోసారి హ్యాట్రిక్ కోసం చూస్తున్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి చెక్ పెట్టాలంటే సురేశ్​షెట్కార్, సంజీవరెడ్డి ఒకటవ్వాలని కాంగ్రెస్ శ్రేణులు ఆశిస్తున్నాయి.

కానీ వాస్తవ పరిస్థితులు అలా కనిపించడం లేదు. టికెట్టు విషయంలో ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిరే పరిస్థితి లేకపోవడంతో కాంగ్రెస్ హై కమాండ్ కు తలపోటు తప్పడం లేదు.

ఒకరు బీసీ.. మరొకరు సర్వే రిపోర్టులపై..

నారాయణఖేడ్ కాంగ్రెస్ టికెట్ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది. సురేశ్​షెట్కార్, సంజీవరెడ్డిల మధ్య నెలకొన్న టికెట్ పోరులో హై కమాండ్ వద్ద ఒకరు బీసీ నినాదం వినిపిస్తుండగా, సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నాయని మరొకరు బలంగా చెప్పుకుంటున్నారు. అయితే బీసీల మద్దతు, సర్వేల రిపోర్టులు పక్కన పెట్టి ముందు మీ ఇద్దరు ఒక్కటవ్వాలంటూ కాంగ్రెస్ హై కమాండ్​ సయోధ్య కుదుర్చే ప్రయత్నం చేస్తోంది. తర్వాతే టికెట్టు ఎవరికి ఇచ్చేది నిర్ణయిస్తామని చెబుతున్నా ఆ ఇద్దరూ నేతలు మాత్రం ససేమిరా అంటున్నట్టు తెలిసింది. 

 2018 పునరావృతమయ్యేనా?

ప్రస్తుతం ఖేడ్ కాంగ్రెస్ లో సురేశ్​షెట్కార్, సంజీవరెడ్డి పొలిటికల్ వార్ చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ వీళ్లిద్దరూ కలిసి పనిచేయకపోతే 2018లో జరిగిన సీనే మళ్లీ రిపీట్ అవుతుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ తరపున సురేశ్​షెట్కార్ పోటీ చేస్తే బీజేపీ తరఫున పట్లోళ్ల సంజీవరెడ్డి బరిలో నిలిచారు. ఇద్దరు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేయడంతో సురేశ్ షెట్కార్ కు 37,042 ఓట్లు, సంజీవరెడ్డికి 33,060 ఓట్లు పోలవగా, బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి 95,550 ఓట్లు పోలయ్యాయి. ఈ రకంగా ఖేడ్ లో కాంగ్రెస్ దెబ్బతింది.

ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఇలాగే జరిగితే తమ పరిస్థితి ఏంటనే ఆందోళనలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. కాగా నారాయణఖేడ్ బీజేపీలోని ఓ వర్గం నాయకులు మాత్రం సంజీవరెడ్డిపై ఆశలు పెట్టుకుని ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తే కచ్చితంగా గెలిపిస్తామన్న భరోసా కల్పిస్తున్నారు. ఏదేమైనా ఆ ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చి నారాయణఖేడ్ ను తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ హై కమాండ్​ భావిస్తోంది.