
తార్నాక, వెలుగు: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణతో మాల సమాజానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ తెలంగాణ మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం తార్నాకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావుకు వినతిపత్రం అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి చర్యలు, రోస్టర్ విధానం వల్ల మాల విద్యార్థులు, ఉద్యోగులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో నష్టం జరుగుతోందని జేఏసీ నాయకులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్సీ వర్గీకరణ ద్వారా గ్రూప్- 3లో 26 మాల ఉపకులాలను చేర్చి, రోస్టర్ 22గా నిర్ణయించడం ద్వారా అన్యాయం జరుగుతోందని లెక్కలతో కూడిన సమగ్ర వివరాలను రామచంద్రరావుకు వివరించారు. ఈ విషయంలో బీజేపీ పక్షాన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ మాందాల భాస్కర్, గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్, గౌరవ అధ్యక్షులు చెరుకు రామచందర్, విద్యార్థి నాయకులు రాహుల్, సైదులు, మాల ఉద్యోగులు పాల్గొన్నారు.